Paper Valuation | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనాన్ని హడావుడిగా చేస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ చేత రోజుకు 50 పేపర్లు మూల్యాంకనం చేయిస్తున్నట్టు టీచర్లు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల 45-60 పేపర్లు దిద్దిస్తున్న ఉదంతాలున్నట్టు చెబుతున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం ఈ నెల 7న ప్రారంభమైంది. ఒక్కో టీచర్‌కు 40 సమాధానపత్రాలు ఇవ్వాల్సి ఉంది. కానీ అంతకు మించి ఇస్తున్నట్టు టీచర్లు గగ్గొలుపెడుతున్నారు.
హైదరాబాద్ జిల్లాలో 50 పేపర్లు ఇచ్చినట్టు, సిద్దిపేట జిల్లాలోనూ 45-50 పేపర్లు ఇచ్చినట్టు టీచర్లు చెబుతున్నారు. మూల్యాంకనాన్ని ఈ నెల 15తో పూర్తిచేయాల్సి ఉంది. కొన్ని జిల్లాల్లో సోషల్, ఇంగ్లిష్ పేపర్ల మూల్యాంకనం పూర్తికాలేదు. దీంతో మూల్యాంకనం త్వరగా పూర్తిచేయాలని ఒత్తిడి తెస్తున్నట్టు టీచర్లు ఆరోపిస్తున్నారు. దీంతో 50 పేపర్లు ఇస్తున్నట్టు చెబుతున్నారు. ఇదే విషయంపై ఆరా తీసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావును ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించగా, ఆయన స్పందించలేదు.
మూల్యాంకన కేంద్రాల్లో స్క్రూటీనైజర్ల చేత అధికారులు గొడ్డుచాకిరి చేయించుకుంటున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక కొందరు స్క్రూటీనైజర్లు విధులకు డుమ్మా కొడుతున్నారు. అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన తర్వాత మార్కుల క్రోడీకరణ తంతును స్క్రూటీనైజర్లు చేస్తారు. ఒక్కో స్క్రూటీనైజర్కు 200 పేపర్లు ఇస్తున్నారు. రోజుకు 200 మంది విద్యార్థుల మార్కులను క్రోడీకరించాల్సి రావడంతో టీచర్లు వామ్మో..! అని భయపడుతున్నారు. కొందరు స్క్రూటీనైజర్లు మా వల్ల కాదంటూ… మేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు.
పదో తరగతి మూల్యాంకన పారితోషికాన్ని పెంచాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అసిస్టెంట్ ఎగ్జామినర్‌కు ఒక పేపర్‌కు రూ.10, కన్వెయన్స్ కింద రోజుకు రూ.50 మాత్రమే చెల్లిస్తున్నారు. రోజుకు రూ. 500 చెల్లించడంతోపాటు, అదనంగా టీడీ, డీఏ ఇవ్వాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. నిరుటి పారితోషికాన్ని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేశారు. ఇంకా కొంత మందికి అందలేదు. మూల్యాంకనం ముగిసిన రోజు పారితోషికాన్ని చెల్లించాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. మూల్యాంకన కేంద్రాల్లో సౌకర్యాలలేమి పీడిస్తున్నదని టీచర్లు ఆరోపిస్తున్నారు. ఫ్యాన్లు సరిపోక ఉక్కపోతల మధ్య పనిచేయాల్సి వస్తున్నదని, చిన్న పిల్లలు కూర్చుండే బెంచీలపై కూర్చోవడంతో వెన్నునొప్పి, ఒళ్లు నొప్పుల సమస్యలొస్తున్నట్టు వాపోతున్నారు.