హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 ( నమస్తే తెలంగాణ ) : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న హైదరాబాద్‌కు రానున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో ఆమె పాల్గొననున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్, ఆర్అండ్బీ, అగ్నిమాపక, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖలు, జీహెచ్ఎంసీతో నిర్వహించిన కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ భద్రతపై పలు సూచనలు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అగ్నిమాపక శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, విద్యుత్ శాఖ జనరేటర్స్, ఆర్ అండ్ బీ స్టేజ్ సర్టిఫికెట్, బ్యారిగేటింగ్, వ్యూకట్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ ద్వారా తాగునీరు, పారిశుధ్య పనులు నిరంతరం జరగాలని సూచించారు. ఐదు మెడికల్ స్టాల్స్‌తో పాటు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటాచారి, ఆర్డీవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.