గురువారం 02 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 00:45:55

రెడీమేడ్‌గా నివాసం

రెడీమేడ్‌గా నివాసం

  • ప్రీఫ్యాబ్రికేటెడ్‌తో రూపకల్పన  
  • పిల్లర్లపై నిలబెట్టుకొనే అవకాశం 
  • ఆధునిక హంగులతో నయా ఘర్‌ 

పెబ్బేరు రూరల్‌: సాధారణంగా ఇల్లు కట్టాలంటే ఎన్నో ఆపసోపాలు పడుతుంటాం. కానీ ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇల్లు రెడీమేడ్‌గా తయారుచేసింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌కు చెందిన సత్యన్న అనే వ్యక్తికి వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లె సమీపంలో వ్యవసాయ క్షేత్రం ఉన్నది. తక్కువ సమయంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు నిర్మించుకొనేందుకు సత్యన్న విభిన్నంగా ఆలోచించారు. హైదరాబాద్‌ కొంపల్లి పక్కనున్న దూళ్లపల్లిలో ప్రీఫ్యాబ్రికేటెడ్‌ ప్లాస్టిక్‌తో తయారుచేసిన ఇంటిని తీసుకొచ్చి వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన పిల్లర్లపై నిలబెట్టారు. 50 చదరపు గజాల్లో 25 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు, ఆరడుగుల బాల్కనీతో దీన్ని తయారుచేశారు. 

ఇందులో హాలు, పడక గది, వంటగది, బాత్‌రూమ్‌ ఇతర సౌకర్యాలు కల్పించారు. దీనికి రూ.7.50 లక్షల వ్యయమైందని, తయారీదారులే తీసుకొచ్చి బిగించారని సత్యన్న ఫాంహౌజ్‌ నిర్వాహకుడు భరత్‌ తెలిపారు. పిల్లర్ల నిర్మాణానికి రూ.50 వేలు ఖర్చయిందనీ, మొత్తం ఇంటి ఖర్చు రూ.8 లక్షలని వివరించారు. 44వ నంబరు జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన ఈ ఇంటిని వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. logo