PRC | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణకు ప్రభు త్వం నియమించిన పీఆర్సీ కాలపరిమితి గత నెల 31తో ముగిసింది. ఈ కమిషన్ ఉద్యోగుల మూలవేతనం, కరువుభత్యం ఫిట్మెంట్లను శాస్త్రీయంగా పరిశీలించి కొత్త మాస్టర్ స్కేల్, ఇంక్రిమెంట్లను ప్రతిపాదించాల్సి ఉన్నది. ఇందుకు సంబంధించి ఈ కమిషన్ రూపొందించిన నివేదికను ప్రభు త్వం స్వీకరించలేదు. కమిషన్ గడువును కూ డా పొడిగించలేదు. దీంతో త్రిశంకుస్వర్గంలో కొత్త పీఆర్సీ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇంతకూ పీఆర్సీ కమిషన్ ఉన్నట్టా? లేన ట్టా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
పీఆర్సీ కమిషన్ గడువు పొడిగించొద్దని, నివేదిక తెప్పించుకుని ఉద్యోగులకు మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించాలని తెలంగాణ ఉద్యో గ సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు గురువారం సీఎస్‌కు లేఖ రాసింది. పీఆర్సీ కమిషన్ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని రాసేందుకు దాదాపు 3 ఏండ్లు పట్టిందని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పీఆర్సీ రిపోర్ట్ ఇచ్చేందుకు అంతకంటే ఎక్కువ రోజులే పట్టేటట్టు ఉన్నదని ఉ ద్యోగులు మండిపడుతున్నారు.
వేతన సవరణ చేయకపోవడంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. మొదటి పీఆర్సీ గడువు ముగిసి 33 నెలలు కావొస్తున్నది. ఇప్పుడున్న మూలవేతనానికి 1% ఫిట్మెంట్ లెక్కిస్తే ఏడాదికి రూ.200 కోట్లు అవుతుంది. ఈ లెక్కన తక్కువలో తక్కువగా 20% ఫిట్‌మెంట్‌ను లెక్కలోకి తీసుకున్నా ఉద్యోగులు ఏడాదికి రూ.4 వేల కోట్ల చొప్పున గత మూడేండ్ల నుంచి రూ.12 వేల కోట్లు నష్టపోయారు. తెలంగాణ మొదటి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసింది. జూలై 1 2023 నుంచి రెండో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉన్నది. కొత్త పీఆర్సీలో ప్రభుత్వం ఆమోదించిన ఫిట్మెంట్ మొత్తాన్ని 2023 జూలై నుంచి చెల్లించాలి.
2023 అక్టోబర్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్‌గా పీఆర్సీ కమిటీని నియమించిన ప్రభుత్వం.. ఆ కమిటీ సభ్యుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీ రామయ్యకు చోటు కల్పించింది. ఈ మేరకు జీవో 159 జారీచేసింది. ఈ కమిటీ 6 నెలల్లోగా తన నివేదికను ప్రభుత్వానికి అందచేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
ఈ కమిషన్ గడువు 2026 ఏప్రిల్ 2న ముగియడంతో 6 నెలలు పొడిగించారు. ఆ తర్వాత 2024 సెప్టెంబర్‌లో, 2025 మార్చిలో, 2025 సెప్టెంబర్‌లో మరో మూడుసార్లు గడువు 6 నెలల చొప్పున గడువు పొడిగించారు. ఆ గడువు గత నెల 31తో ముగిసింది.
అధికారిక సమాచారం మేరకు 2025 మార్చిలోనే పీఆర్సీ కమిషన్ సమగ్ర నివేదిక తయారు చేసి, దాన్ని ప్రభుత్వానికి సమర్పించేందుకు అనుమతి కోరింది. కానీ, ఆ నివేదికను స్వీకరించేందుకు సర్కార్ సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రభుత్వం నుంచి స్పం దన లేకపోవడం, గడువును తరచూ పొడిగించడంతో పీఆర్సీ కమిషన్ ఉత్సవ విగ్రహంలా తయారైంది. వాస్తవానికి పీఆర్సీ నివేదిక అంటేనే సర్కార్ జంకుతున్నది. ఆ నివేదిక తమ చేతికి అందితే ఉద్యోగుల నుంచి వచ్చే ఒత్తిడిని భరించలేమన్న భావనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపు లో కేసీఆర్ సర్కార్‌దే రికార్డు. బంపర్ పీఆర్సీలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. 2015లో ఏకంగా 43% ఫిట్మెంట్తో పీఆర్సీని వర్తింపజేసిం ది. తెలంగాణలో తొలిసారి సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలో ఏర్పాటైన పీఆర్సీ కేవలం 7.5% ఫిట్‌మెంట్‌కే సిఫారసు చేసినప్పటికీ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా 30% ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. ఏటా రూ.12, 595 కోట్ల అదనపు భారం పడినా ఉద్యోగులతో ఉన్న పేగుబంధాన్ని దృష్టిలో ఉంచుకు ని ఆ మొత్తాన్ని భరించేందుకు సిద్ధపడింది.
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కొత్త పీఆర్సీ, పెండింగ్ డీఏలు చెల్లిస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారు. కానీ, ఇప్పటికీ అతీగతీ లేదు. పీఆర్సీ లేక 33 నెలలు గడిచిపోయింది. పీఆర్సీ ఆలస్యం కావడంతో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు తమ హక్కులను కోల్పోతున్నారు. ఇంకో ఏడాది గడిస్తే కొత్త కమిషన్‌ను వేయాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే పీఆర్సీ నివేదికను విడుదల చేయాలి.
– మారం జగదీశ్వర్,ఉద్యోగుల జేఏసీ చైర్మన్