Telangana | నిజామాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండల కేంద్రంలో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం ప్రదర్శించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే అప్రజాస్వామికంగా వ్యవహరించారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జూపల్లితోపాటు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. అధికార పార్టీ నేతలు కుప్పలు తెప్పలుగా పా ల్గొనడంపై వేముల అభ్యంతరంతో వారిని బయటకు పంపించారు. అనంతరం వేముల మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బాల్కొండ నియోజకవర్గంలో సుమారు రెండు వేలమందికి షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారని, వీరికి తులం బంగారం ఎప్పుడు ఇస్తారని మంత్రి జూపల్లిని మర్యాదపూర్వకంగా అడిగారు. మంత్రి స్పందిస్తూ, అప్పుల గురించి మాట్లాడి, తులం బంగారం హామీపై దాటవేశారు.
వేముల కలుగజేసుకుని నేరుగా సమాధానం చెప్పాలని కోరారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు అరుపులు కేకలతో గందరగోళం సృష్టించారు. బీఆర్ఎస్ నేతలు కూడా ప్రతిగా స్పందించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలను వదిలి, బీఆర్ఎస్ శ్రేణులపైనే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఫంక్షన్ హాలు నుంచి బయటకు పరుగులు తీసే వరకూ వెంటాడి కొట్టారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ, పోలీసుల నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వేముల బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రధాన రహదారిపై రెండు గంటలపాటు ఆందోళన చేపట్టారు. లాఠీచార్జ్‌లో పలువురు నేతల చొక్కాలు చిరిగిపోయాయి. కొంతమందికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. హామీలు అమలు చేయాలన్నందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశా రని, ఉడుత బెదిరింపులకు భయపడబోమని చెప్పారు. భీమ్‌గల్ సీఐ, పోలీసులు కాంగ్రెస్ కనుసన్నల్లో పని చేస్తూ బీఆర్ఎస్ నాయకులను ఇష్టారీతిన కొట్టారని, ప్రతి ఒక్కరి పేరు ను పింక్‌బుక్‌లో రాసుకుంటున్నామని, చట్టాన్ని అతిక్రమించి లాఠీచార్జ్జ్ చేసిన అధికారి సంగతి చూస్తామని హెచ్చరించారు.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నించడమే నేరమా?అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన ఉన్నదా? పోలీసుల పాలనా ఉన్నదా? అని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఏమైందని అడిగినందుకు భీమ్‌గల్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలపై మంత్రి జూపల్లి పోలీసులతో లాఠీచార్జ్జ్ చేయించారని విమర్శించారు. లాఠీచార్జ్‌లకు, కాంగ్రెస్ కార్యకర్తల దాడులకు భయపడేదేలేదని స్పష్టంచేశారు. హామీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటామని, కాంగ్రెస్ నాయకులను నిలదీస్తూనే ఉంటామని పేర్కొన్నారు. లాఠీలను చూపించి భయపెట్టడం కాదని, చేతనైతే హామీలను అమలుచేసి చూపించాలని సవాలు చేశారు. లాఠీచార్జ్‌కు పాల్పడిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయాలని అడిగితే పోలీసులను ఉసిగొల్పి చితకబాదించడం ప్రజాపాలనా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. తులం బంగారం ఎప్పుడిస్తారని అడిగిన బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడం అమానుషమ ని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకానికి అడ్డూ అదుపులేకుండా పోతున్నదని మండిపడ్డారు. పోలీసులు కాంగ్రెస్ నేతలకు కొమ్ముకాయడం సిగ్గుచేటని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పోలీసుల పేర్లను పింక్‌బుక్‌లో రాస్తున్నామని, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, వారంతా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. పోలీసుల లాఠీచార్జ్‌కు గురైన బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు.