Irrigation water | ఒక్క ఊరు వంద బోర్లు.. సాగునీటి కోసం రైతుల తిప్పలు
Irrigation water | వనపర్తి జిల్లాలో యాసంగి సాగుబడులు చేసిన రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎదురుకాని సాగునీటి సమస్య కాంగ్రెస్ సర్కారు వచ్చాక అడుగడుగునా కనిపిస్తున్నది. జిల్లాలోని సాగునీటి కాల్వలు రెండు నెలల ముందే వట్టిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
- నెల రోజుల్లో ఏదుట్ల జల్లెడ
- అడుగంటిన భూగర్భ జలాలు
- ఎండిన చెరువులు.. తడారిన పొలాలు
- దిక్కుతోచని స్థితిలో బోర్ల డ్రిల్లింగ్
- 20 బోర్లలో చుక్కనీరూ పడలే..
- ఏకంగా 5 బోర్లేసిన రైతు ప్రకాశ్శర్మ
వనపర్తి/నల్లగొండ ప్రతినిధి, ఖమ్మం, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లాలో యాసంగి సాగుబడులు చేసిన రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎదురుకాని సాగునీటి సమస్య కాంగ్రెస్ సర్కారు వచ్చాక అడుగడుగునా కనిపిస్తున్నది. జిల్లాలోని సాగునీటి కాల్వలు రెండు నెలల ముందే వట్టిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వేసిన పంటలు చేతికి అందుతాయో లేదోనన్న ఆందోళనలతో కొత్త బోర్లు వేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. గతంలో పుష్కలంగా నీరందించిన వ్యవసాయ బోర్లు నేడు ఎక్కడికక్కడ ఎండిపోతుండటం రైతులను నివ్వెరపరుస్తుంది.
ఎండుతున్న బోర్లు
దశాబ్దకాలం పాటు కాలువల నీటితో కళకళలాడిన వ్యవసాయం మళ్లీ ఎనకటి రోజుల్లోకి వెళ్తున్నదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా యాసంగిలో 1.19 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే అందులో వరి 83,820 ఎకరాలు, వేరుశనగ 21,286, పెసర 12,434 ఎకరాల్లో సాగు చేశారు. మరో 2 వేల ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న తదితర పంటలను వేసుకున్నట్టు అంచనా.
అగమ్యగోచరంగా ‘సాగర్’ రైతన్న
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో రైతన్న పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. యాసంగిలో సాగుచేసిన వరి పంట కండ్ల ముందే ఎండుతుంటే రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు కొత్తగా బోర్లు, బావులు తవ్వుతున్నా భూగర్భజలాలు అడుగంటుతుండడంతో ఆశించిన ఫలితం కనిపించడం లేదు. ఆయకట్టు పరిధిలోని చెరువుల్లోనూ నీటి నిల్వలు అడుగంటి పోతుండడంతో భూగర్భ జలాలపై ప్రభావం పడింది. బోర్లు, బావుల్లోనూ నీటి లభ్యత క్రమంగా పడిపోతున్నది. ఫిబ్రవరి రెండో వారం నాటికి అటోఇటో పంటను కాపాడుకున్నా మూడోవారం వచ్చేసరికి నీటి లభ్యత లేక కష్టంగా మారింది.
మరింత అగాధంలోకి రైతులు
భూమినే నమ్ముకున్న రైతులు బోర్లు, బావుల కింద పంటను సాగుచేసి చివర్లో ప్రభుత్వం ఒకటో రెండో తడులకు నీళ్లు ఇవ్వకపోతదా? అన్న ఆశతో ఉన్నారు. అయితే, ఆలోపే ఎండుతున్న పంటను కాపాడేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేసిన బోర్లల్లో నీరు రాక ఆర్థికంగా నష్టపోతున్నారు. రెండెకరాలు ఉన్న రైతు కూడా పంటను కాపాడుకునేందుకు రూ.50 వేలకు పైగా ఖర్చు చేసి బోర్లు వేయిస్తున్నారు. వేలకు వేలు ఖర్చు చేసిన బావు ల్లో పూడికతీతతోపాటు క్రేన్ సాయంతో లోతు తవ్విస్తున్నారు. గత ఐదేండ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలే.
18 ఏండ్లు బోసిపోయిన కాల్వలు
ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో మండలంలో తవ్విన కాల్వలు దాదాపు 18 ఏండ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 405 కిలోమీటర్ల దూరంలోని పెన్పహాడ్ మండలానికి సాగునీరు అందించింది. మరోపక్క నాగార్జునసాగర్, మూసీ జలాలు అందడంతో మూడున్నరేండ్లుగా పుష్కలంగా పంటలు పండాయి. మూడు నదులు పారే అవకాశం ఉన్న ఈ మండలంలో ఇప్పుడు కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం నీటికి కోత పెట్టడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతున్నది. గతంలో కాళేశ్వరం నుంచి వచ్చే గోదావరి జలాలను ఆయకట్టు పరిధిలో వారాబందీ ప్రకారం ఏడు రోజుల చొప్పున ఆరు విడుతల్లో అందించారు. 42 రోజుల పాటు రోజుకు 2500 క్యూసెక్కుల చొప్పున వారానికి 17,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రోజుకు 1800 చొప్పున వారానికి 10,800 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. వారానికి 6500 చొప్పున ఆరు వారాలకు 39వేల క్యూసెక్కుల నీటికి కోత విధించడంతో శివారున ఉన్న పెన్పహాడ్ మండలంలోని భూములకు నీరు అందడం లేదు.
బోర్లబాటలో మండలాలు
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామ రైతులు ఫిబ్రవరిలో ఏకంగా 100 బోర్లు వేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామంలో 1,800 మంది రైతులు ఉండగా, ప్రసుత్త యాసంగిలో 744 మంది వరి పంట సాగుచేశారు. గ్రామంలో ఇటీవల వంద బోర్లు వేస్తే 20 బోర్లలో చుక్కనీరు పడలేదు. వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడి రైతులు నెల రోజుల్లో 50 బోర్లు వేయించారు. వందల అడుగులు డ్రిల్లింగ్ వేస్తున్నా నీళ్లు పడడం లేదు. ఒక్కో రైతు ఐదారు బోర్లు వేయిస్తున్నా నిరాశే మిగులుతున్నది. వీపనగండ్ల, చిన్నంబాయి, పెద్దమందడి, కొత్తకోట, పాన్గల్ మండలాల్లో కొత్త బోర్ల తవ్వకం జోరుగా సాగుతున్నది. ఏదుట్లలో ప్రకాశ్శర్మ ఒక్కడే 5 బోర్లు వేశాడు.
కనిష్ఠస్థాయికి నీటి నిల్వలు
గడిచిన ఐదేండ్ల భూగర్భ జలాల గణాంకాలకు భిన్నంగా ఈసారి నీటి నిల్వలు మరింత కనిష్ఠస్థాయికి చేరుకున్నాయి. ఏటా జనవరిలో చేసే సర్వే ప్రకారం జిల్లాలో సగటున 4.46 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉంటుంది. కానీ, ఈ ఏడాది అది 5.46 మీటర్లకు పడిపోయింది. సత్తుపల్లి, ఎర్రుపాలెం, సింగరేణి, కామేపల్లి, ఏన్కూరు వంటి మండలాల్లో భూగర్భ జలాలు మరింత తగ్గాయి. మార్చి నెల చివరి నాటికి ఇవి మరింత తగ్గే ప్రమాదముందని సంబంధిత అధికారులు చెప్తున్నారు.
గత ఐదేండ్ల నీటి లభ్యత వివరాలు ఇలా

బోర్లు వేస్తూ అప్పులపాలు
నీటి కోసం రైతులు ఎడాపెడా బోర్లు వేస్తుండడంతో మళ్లీ అప్పులపాలవుతున్నారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో యాసంగి సాగుబడులున్నాయి. వీటిలో వరి 50 వేల ఎకరాల్లో సాగవగా, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు మరో 50 వేల ఎకరాల్లో సాగయ్యాయి. జూరాలతోపాటు భీమా, ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదల పూర్తిగా నిలిచిపోయింది. యాసంగిలో కొంత వరకైనా నీటి విడుదల ఉంటుందని ఆశించిన రైతులకు నీళ్లు లేవని చెప్తూ సర్కారు చేతులెత్తేయడంతో బోరు, బావుల ఆధారంగా పంటలు సాగుచేసిన రైతులు అవస్థలు పడుతున్నారు. నీరు లేక పంటను వదిలేశారు. మరికొందరు పంటలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.
నీళ్లు లేక యాసంగి వేయలేదు
నీళ్లు లేక మా తుమ్మలచెరువు కింద ఈసారి యాసంగి వేయలేదు. మా చెరువు ఏటా ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటుంది. ప్రస్తుతానికి చెరువు కింద సగం భూములకు మాత్రమే సాగునీరు అందుతున్నది. ఈ యాసంగిలో సుమారు నాలుగు వేల ఎకరాలు బీడు భూములుగా మారాయి.
-వేల్పుల ఉప్పలయ్య, రైతు, మొండికుంట, అశ్వాపురం మండలం, భద్రాద్రి జిల్లా
నీళ్లు అడుగంటాయి
గీ సమయంలో భూ గర్భ జలాలు అడుగుంటిపోతాయని ఎప్పుడు అనుకోలే. నిరుడు ఈ సమయంలో నిండుగా వరిపొలం పారింది. ఇప్పుడు నీరు లేక ఉన్న బోరు ఎత్తిపోవడంతో బావిలో పూడికతీత పనులు చేసిన. ఇప్పటివరకు రెండు ఎకరాలు నాటు వేసిన. పొట్టదశలో ఉన్న పంటకు సరిగా నీరు అందుతలేదు.
– గాజుల సిద్దిలింగం, సిద్దెంకి, జనగామ
ఐదేండ్లుగా ఎండిపోలే
ఐదేండ్లలో బావిలో నీరు తగ్గింది లేదు. పంట ఎండిపోయింది లేదు. కాలువల్లో ఎప్పు డు చూసినా నీరు వచ్చే ది. ఈ యేడు యాసంగి సాగుకు నీరు ఇస్తామన్నారు. వరి వేసి రెండు నెలలైంది. ఇప్పుడే పంటకు నీరు అందక ఇబ్బంది అవుతాంది. ఇంకా నెలపదియేను రోజులు పంటకు నీళ్లు పెట్టుడు ఇబ్బందే.
– బదావత్ బుగ్గ, పుసలితండా, మహబూబాబాద్ జిల్లా
మూడు బోర్లు వేసినా
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు జే ధర్మయ్య. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని ఏదుట్ల. తనకున్న మూడెకరాలతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు.
ఎంజీకేఎల్ఐ డీ-8 కాల్వ రెండు నెలల క్రితమే బందైంది. ఉన్న ఒక్క బోరు ఎండిపోయింది. గత్యంతరం లేక రూ. 1.2 లక్షలతో ఇటీవలే మూడు బోర్లు వేశాడు. రెండుబోర్లలో చుక్కనీరైనా పడలేదు. ఇప్పటికే మూడెకరాల్లో వరిని వదిలేసుకున్నాడు. ఉన్న పంటనై చేతికి వస్తుందో, లేదోనన్న అయోమయంలో ఉన్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Bore well
- Congress govt
- farmer
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

