హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయనను శనివారం ఉదయం నుంచి రాత్రి 8.40 వరకు విచారించారు. ఈ కేసులో ఇప్పటికి మూడుసార్లు ప్రభాకర్‌రావును సిట్ విచారించింది. శనివారం నాటి విచారణకు ప్రభాకర్‌రావు సహకరించలేదని తెలిసింది. పదేపదే అడిగిన ప్రశ్నలే అడగటంతో.. ఆయన కూడా గత విచారణలో చెప్పిన సమాధానాలే చెప్పినట్టు సమాచారం.
ఈ కేసులో ఇకపై బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్ట్‌లను పిలిచి వారి వాంగ్మూలం తీసుకోనున్నట్టు తెలిసింది. త్వరలో ప్రభాకర్‌రావు ఫోన్లను సీజ్ చేయనున్నట్టు సమాచారం. కాగా, ఈ నెల 17న ప్రభాకర్‌రావును మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ అధికారులు ఆదేశించారు.