భువనగిరి అర్బన్ మే 22: రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని, నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తున్నామని ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సభ్యులందరూ ఓవైపు ఘంటాపథంగా చెప్తుండగా.. మరోవైపు సర్కారు దవాఖానలే అంధకారంలో మగ్గుతున్నాయి. నిన్న మంగళవారం వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఐదు గంటలపాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగగా నేడు బుధవారం భువనగిరి సర్కారు దవాఖానలో అదే సీన్ రిపీట్ అయింది.
ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించి కొన్ని గంటలు కూడా కాకముందే భువనగిరి దవాఖానలో చీకట్లు అలుముకున్నాయి. దీంతో అత్యవసర వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో బుధవారం రాత్రి 8.00 గంటలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
విద్యుత్తు లేని సమయంలో వినియోగించాల్సిన దవాఖానలోని జనరేటర్ సైతం మొరాయించింది. దీంతో దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులు, పిల్లలు తీవ్ర అవస్థలు పడ్డారు. దాదాపు గంటా 10 నిమిషాలపాటు కరెంట్ లేకపోవడంతో ఓవైపు ఉక్కపోత.. మరో వైపు చీకట్లు అలుముకోవడంతో రోగులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పిల్లల వార్డులో చిన్నారులు గుక్కపెట్టి ఏడ్వడం వినిపించింది.

అదే సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో దవాఖానకు వచ్చిన ఇద్దరు రోగులకు డాక్టర్లు సెల్‌ఫోన్ లైట్ల సాయంతో వైద్యం అందించారు. సెల్‌ఫోన్ వెలుగులోనే డాక్టర్లు రోగులకు మందులు రాయడం, ఇంజెక్షన్ చేయడం కనిపించాయి. గంట తర్వాత కరెంట్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పేరుకు పెద్దాస్పత్రి అయినా సర్కారుకు పేదల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం అంటూ రోగులు, వారి సహాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
అత్యవసర వైద్యం అవసరమైతే రోగుల పరిస్థితి ఏమిటని మండిపడ్డారు. దీనిపై దవాఖాన సూపరింటెండెంట్ చిన్నానాయక్ను వివరణ కోరగా, పది నిమిషాలు మాత్రమే కరెంటు పోయిందని, తమ వద్ద ఆటోమేటిక్ జనరేటర్ లేదని, ఉన్న జనరేటర్‌ను ఆన్ చేయడానికి సమయం పట్టిందని తెలిపారు. పది నిమిషాల్లో జనరేటర్ ద్వారా కరెంట్ సరఫరాను పునరుద్ధించామని చెప్పుకొచ్చారు.

ఎంజీఎంలో విద్యుత్తు అంతరాయంపై దర్యాప్తు
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలపాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగిన మాట వాస్తవమేనని ప్రభుత్వం అంగీకరించింది. హైటెన్షన్ లైన్లకు, ఎంజీఎం విద్యుత్తు లైన్లకు మధ్య సాంకేతిక లోపంలో సాయంత్రం 6.15 గంటలకు కరెంట్ పోయిందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్‌టీ లైన్ల మరమ్మతు అనంతరం రాత్రి 9.00 గంటలకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించామని పేర్కొంది.
ఈ అంశంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం ఉదయం అధికారులతో సమీక్షించారు. ఎంజీఎం దవాఖానలో జరిగిన విద్యుత్తు అంతరాయంపై 24 గంటల్లోగా ఎంక్వైరీ నిర్వహించి నివేదిక ఇవ్వాలని, బాధ్యులైనవారిపై చర్య తీసుకోవాలని తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎంఎస్ఐడీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు. దీనిపై వెంటనే స్పందించిన టీఎంఎస్ఐడీసీ ఎండీ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో విద్యుత్తు వ్యవస్థను తనిఖీ చేసి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని తమ ఇంజినీర్లను ఆదేశించారు.

విద్యుత్తు కోతలకు బాధ్యత ఎవరిది?: కేటీఆర్
వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఐదు గంటలపాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం హృదయవిదారకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆవేదన వ్యక్తంచేశారు. కేటీఆర్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. దవాఖానలో విద్యుత్తు కోతతో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధులైన రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పించలేదని, కనీసం ఉన్న దవాఖానలను కూడా నిర్వహించలేకపోతున్నదని మండిపడ్డారు. కరెంటు కోతలు లేవని సీఎం, మంత్రులు పదే పదే చెబుతున్నారని, కానీ ఎంజీఎంలో విద్యుత్తు కోతలకు ఎవరు బాధ్యత వహిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.
మార్పు ఇదేనా: హరీశ్‌రావు
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు విమర్శించారు. ‘ఇదేనా మార్పు అంటే..?, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే..?’ అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. వరంగల్‌లోని ఎంజీఎం, భువనగిరి జిల్లా దవాఖానలో విద్యుత్తు అంతరాయంపై ఆయన స్పందిస్తూ.. రాష్ట్రంలో కరెంట్ కోతలకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం ఉంటుందని ప్రశ్నించారు. ఈ కరెంట్ కోతల వల్ల అత్యవసర విభాగంలో విషమ పరిస్థితిలో ఉన్న రోగులు నరకం అనుభవిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా కండ్లు తెరవాలని, రాజకీయాలు పక్కనపెట్టి, పరిపాలనపై దృష్టి సారించాలని హితవు చెప్పారు.