స్లీప్ అప్నియా.. రక్తనాళాల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుందట. గురక, నిద్రలో శ్వాస పదేపదే ఆగిపోవడం వల్ల.. వాస్కులర్ ఏజింగ్ సమస్య వచ్చే అవకాశం కూడా ఉన్నదట. తాజాగా, 20 దేశాలలోని 29,653 మంది పెద్దల డేటాను విశ్లేషించిన పరిశోధకులు.. ఈ విషయాన్ని బయటపెట్టారు. స్లీప్ అప్నియా-వాస్కులర్ ఏజింగ్ మధ్యగల సంబంధం గురించిన వివరాలను వెల్లడించారు. నిద్రలో శ్వాస పదేపదే ఆగిపోవడం వల్ల శరీరంలో కొన్ని ప్రతికూల మార్పులు జరుగుతాయట. రక్తంలో ఆక్సిజన్ స్థాయులు అకస్మాత్తుగా పడిపోవడం, పెరగడం వల్ల ‘ఆక్సిడేటివ్ స్ట్రెస్’ పెరుగుతుంది. ఇది రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తుంది. ఇక శ్వాస ఆగిపోయిన ప్రతిసారీ రక్తపోటు అకస్మాత్తుగా ఎక్కువ అవుతుంది. దీనివల్ల రక్తనాళాల గోడలు గట్టిగా మారుతాయి. అంతేకాకుండా, స్లీప్ అప్నియా వల్ల శరీరంలో సీ-రియాక్టివ్ ప్రొటీన్ లాంటి ఇన్ఫ్లమేటరీ కారకాలు పెరుగుతాయి.
ఇవి రక్తనాళాల వృద్ధాప్యానికి దారితీస్తాయి. దీర్ఘకాలంలో, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి అవి మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా, రక్తనాళాల పనితీరు తగ్గి.. గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. మెదడుకు వెళ్లే రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ఆలోచనా శక్తిపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి, వాస్కులర్ ఏజింగ్‌ను అరికట్టడానికి స్లీప్ అప్నియా నుంచి బయటపడాలని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడం వల్ల స్లీప్ అప్నియా తీవ్రత గణనీయంగా తగ్గుతుందట, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తనాళాల స్థితిస్థాపకత పెరుగుతుంది. యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా.. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించవచ్చు. తద్వారా రక్తపోటు, గుండెపోటు లాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.