Telangana | హైదరాబాద్, మార్చి 7 ( నమస్తే తెలంగాణ) : కర్షకులకు మళ్లీ కాళరాత్రులు వచ్చాయి. 24 గంటల నిరంతర కరెంటుతో పదేండ్ల పాటు గుండెలపై చెయ్యేసుకొని కంటి నిండా నిద్రపోయిన రైతులకు ఇప్పుడు కునుకు కరువైంది. రాష్ట్రంలో సమైక్య పాలన నాటి విద్యుత్తు కష్టాలు పునరావృతమవుతున్నాయి. పొలానికి నీళ్లు పెట్టేందుకు కరెంటు కోసం అర్ధరాత్రి పడిగాపులు మొదలయ్యాయి. 14 నెలల్లోనే విద్యుత్తు రంగం అస్తవ్యస్తం కావడంతో అటు అన్నదాతలు, ఇటు ప్రజలకు ‘అప్రకటిత కోతల’ కష్టాలు ఎదురవుతున్నాయి. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటి, మరోవైపు చాలీచాలని కరెంటుతో పంటలకు నీళ్లందక ఎండిపోతుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపుమండిన రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. సాగుకు సరిపడా కరెంట్ ఇవ్వని సర్కారుపై నిత్యం ఏదో ఒక చోట నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు.
గ్రామాల్లో రాత్రి 12 గంటలకు త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నారు. ఉదయం 7 గంటలకే ఎండ మండిపోయి పొలాల్లో నీళ్లు ఎండిపోతున్నాయి. రాత్రిపూట నీళ్లు పారిస్తేనే పొలాల్లో జీవం ఉంటున్నది. ఇలా రాత్రిపూట ఇచ్చే కరెంట్ కోసం ఇప్పుడు అర్ధరాత్రి, అపరాత్రి రైతులు బావుల వద్దకు పరుగులు పెడుతూ పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందే తెలియని కరెంట్ కోసం బావుల వద్దే నిద్రకుండా నిరీక్షిస్తున్నారు. ఇది వరకు రైతు ఉదయం 5 గంటలకు పొలానికి వెళ్లి నీళ్లు పారించే పరిస్థితి ఉండగా ఇప్పుడు అర్ధరాత్రి అరిగోస పడుతున్నారు. టార్చిలైట్లు చేతబట్టి చిమ్మచీకట్లల్లో పంటలను కాపాడుకునేందుకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. పాములు, తేళ్లు, విష పురుగులతో మళ్లీ సావాసం చేస్తున్నారు.
విద్యుత్తు రంగ నిర్వహణ అస్తవ్యస్తం కావడంతో రాష్ట్రంలో సంక్షోభానికి దారి తీసి ఎండలు ముదరకముందే అప్రకటిత కోతలు షురువయ్యాయి. దీంతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోవోల్టేజీ సమస్యలు, మోటర్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం వంటివి పునరావృతమవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో వెలుగులు విరజిమ్మిన తెలంగాణలో కాంగ్రెస్ రాగానే కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు పోయినా, ఫ్యూజు పోయినా పట్టించుకునేవారే కరువయ్యారు. విద్యుత్తు సరఫరా వ్యవస్థల మీద అవగాహన లేకుండా ఆపరేషన్ సిబ్బంది బదిలీలు చేపట్టారు. పంపిణీలో అత్యంత కీలకమైన టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 73 ఆపరేషన్ ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ఇంజినీర్లను బదిలీ చేసి పట్టణ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. దీంతో రైతులే మరమ్మతులు చేసుకోవాల్సి వస్తున్నది. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటి, మరోవైపు చాలీచాలని కరెంట్‌తో ఉన్న నీళ్లూ పారక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. సాగుకు సరిపడా కరెంట్ ఇవ్వాలని విన్నవించినా పట్టించుకునేవారే లేక రైతుల ఆందోళనలు నిత్యకృత్యమయ్యాయి.
నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల వంటి జలాశయాల్లో నీళ్లు లేవు. జల విద్యుత్తు ఉత్పత్తి చేసే పరిస్థితులు కనిపించడంలేదు. ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకుంటే కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్నది. ఈ జిల్లాల్లో వ్యవసాయం కాలువల కంటే ఎక్కవగా బోర్లు, బావుల మీదే ఆధారపడి నడుస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో నాట్లు ఆలస్యమయ్యాయి. మే నెల వరకు పంటలకు నీళ్లందించాల్సి ఉన్నది. రాష్ట్రంలో పెరిగిన డిమాండ్‌కు తగినంతగా విద్యుత్తు అందుబాటులో లేదు. గరిష్ఠ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నది. ఫిబ్రవరి 10న 15998 మెగావాట్లు, 19న 16058 మెగావాట్లుగా నమోదైంది. మార్చిలో 17,500 మెగావాట్లకు చేరనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
మన రాష్ట్రంలో విద్యుత్తు సరిపడా లేనందున రోజుకు దాదాపు రూ.10 కోట్లు వెచ్చించి పక్కరాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తున్నది. ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకుంటే కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే డిమాండ్ పెరుగుతున్నది. ఆ జిల్లాల్లో వ్యవసాయం కాలువల పారకం కంటే ఎక్కవగా బోర్లు, బావుల మీదే అధారపడి నడుస్తున్నది. పరిస్థితులను ముందుగా అంచనా వేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్లే సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని విద్యుత్తురంగ నిపుణులు మండిపడుతున్నారు. మార్చి 10లోగా పూర్తి చేయాలని కాగితాలపై గడువు పెట్టుకున్నప్పటికీ ఏవీ కూడా కొలిక్కిరాలేదని చెప్తున్నారు. ఫలితంగా సబ్స్టేషన్లపై ఓవర్‌లోడ్ పడుతున్నదని పరిస్థితి తీవ్రతను వివరిస్తున్నారు.