Deputy CM | హైదరాబాద్, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టినట్టు తెలిసింది. రాష్ట్రంలో బీసీల లెకలు తేలిన నేపథ్యంలో జనాభాకు తగ్గట్టుగా తమకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు మరో మూడు మంత్రి పదవులు ఇవ్వాలని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
ఇదే డిమాండ్‌తో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని కలవాలని, పార్టీ నేతలపై ఒత్తిడి తేవాలని బీసీ ప్రజాప్రతినిధులు నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు కులగణన సర్వే నివేదికతో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్న నేతలు.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ద్వారా రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ కోరినట్టు ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు, ఇటీవల సంచలనం సృష్టించిన పది మంది అసమ్మతి ఎమ్మెల్యేల భేటీపై కూడా తమ అభిప్రాయాలు చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
డిపాజిట్లు దక్కని అసెంబ్లీ సీట్లు అంటగట్టారు
అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేసి, సామాజిక న్యాయం చేస్తామని రాహల్‌గాంధీ మాట ఇచ్చారని, ఈ ప్రకారం ఎకువ జనాభా కలిగిన తమకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని బీసీ నేతలు వాదిస్తున్నారు. తమకంటే తకువ జనాభా ఉన్న అగ్రకులాలకు ఏడు మంత్రి పదవులు, మరో సామాజికవర్గానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేసున్నారు. తమకు జనాభాకు తగ్గట్టు రాజ్యాధికారంలో వాటా లేదని, ఇద్దరికీ మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారని బీసీ ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బీసీలే త్యాగం చేయాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ మేరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లును బీసీలకు కేటాయిస్తామని పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి మాట తప్పారని కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ బీసీ నాయకుడు ఒకరు ఆరోపించారు. బీసీలకు 34 సీట్లు రావాల్సి ఉండగా, 21 సీట్లు మాత్రమే ఇచ్చారని బీసీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇందులో యాకుత్‌పురా, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్టలో గత యాభై ఏండ్లుగా కాంగ్రెస్‌కు ఎన్నడూ డిపాజిట్ కూడా రాలేదని, ఇలాంటి అసెంబ్లీ స్థానాలను బీసీలకు కట్టబెట్టారని గుర్తుచేశారు.
48 నియోజకవర్గాల్లో బీసీ జనాభాను తగ్గించే కుట్ర!
రాష్ట్రంలోని 48 నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారని, ఆయా నియోజకవర్గాల్లో బీసీల సంఖ్య తకువ చేసి చూపించేలా కులగణన జరిగిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఎమ్మెల్యే ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో అన్నారు. ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశాన్ని అగ్రవర్ణ ఎమ్మెల్యేలే లీడ్ చేశారని, కానీ వారి మీద ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పైగా వారి కోసమే హడావుడిగా మంత్రివర్గ సమావేశం, గురువారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారని సదరు బీసీ ఎమ్మెల్యే మనసులో మాట చెప్పారు. కానీ, తప్పుల తడకగా ఉన్న కులగణన, బీసీ జనాభా నివేదికను బీసీ ఎమ్మెల్సీ ఒకరు తప్పుపడితే మాత్రం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారని బీసీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వంలో అగ్రవర్ణాలకు చెందిన మం త్రుల మాటే చెల్లుబాటు అవుతున్నదని, బీసీలను కూరలో కరివేపాకు మాదిరిగా తీసివేస్తున్నారని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు.