వానకాలం మొదలై 35 రోజులు గడిచినయ్.. ఎక్కడా వాన జాడ లేదు. రిజర్వాయర్లన్నీ వెలవెలబోతున్నయ్.. రైతులు నార్లు వేసిన.. వేసుకుంటున్న తరుణంలో సాగునీరివ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద గోదావరిలో ఇప్పటికీ దాదాపు 70 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నా.. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోసుకొనే అవకాశం ఉన్నా.. నీటిని వృథాగా సముద్రంలోకి వదిలిపెడుతున్నది. మేడిగడ్డకు మరమ్మతులు చేయిస్తే రైతులకు నీళ్లివ్వాల్సి వస్తది! నీళ్లిస్తే యూరియా సరఫరా చేయాల్సి వస్తది! యూరియాతో పాటు కరెంటు ఇవ్వాల్సి వస్తది! పండిన పంటను కొనాల్సి వస్తది! పంట కొనుగోలు చేస్తే మద్దతు ధర చెల్లించాల్సి వస్తది! దానికి తోడు బోనస్ ఇవ్వాల్సి వస్తది! ఇన్ని చేసే బదులు అసలు మేడిగడ్డను రిపేర్ చేయకపోతేనే బెటర్ కదా! రైతులు అసలు పంటలు వేయకుండా చూస్తే పోలా!?రేవంత్ సర్కార్ ఆలోచన ఇలా ఉన్నట్టున్నది!
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ‘ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకు వంద అబద్ధాలు ఆడుతారు’ అనడానికి కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వైఖరే నిదర్శనం. కేవలం రెండు పిల్లర్లు కుంగిపోగా.. మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని మొదట ప్రచారం చేసింది కాంగ్రెస్. దాన్ని నిజమని నిరూపించేందుకు పూటకో మాట, రోజుకో అబద్ధం చెప్తున్నది. తెలంగాణ వరప్రదాయినిగా పిలిచే ప్రాజెక్టును రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాజకీయకక్షతో పడావు పెట్టింది. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాల్లో మునిగితేలుతున్నది. తాజాగా నీటిని నిల్వ చేస్తే అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు కూలిపోతాయంటూ అసత్య ప్రచారానికి పూనుకున్నది. దిగువన భద్రాచలం మునుగుతుందని దుష్ప్రచారం మొదలు పెట్టింది. కుంటిసాకులు చెప్తూ కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా, ప్రాణహిత జలాలను దిగువకు వృథాగా వదిలేస్తున్నది. ఫలితంగా లక్షల ఎకరాలకు సాగు నీరందించే అవకాశాన్ని వదిలిపెట్టి రాష్ట్ర రైతులను నిండా ముంచుతున్నది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నదిలో ఇప్పటికే 20 టీఎంసీల జలాలు దిగువకు వృథాగా వెళ్లిపోయాయని అధికార వర్గాలు చెప్తున్నాయి.
కాంగ్రెస్ అబద్ధం 1: మేడిగడ్డలో నీటిని నిల్వ చేయలేం. రిపేర్ తర్వాతే ఎత్తిపోస్తాం.
వాస్తవం: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీబరాజ్) బరాజ్ 7వ బ్లాక్‌లో 20పిల్లర్ కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే. అక్కడ తప్ప మిగతా బ్లాకులన్నీ సేఫ్‌గా ఉన్నాయి. అంతేకాకుండా బరాజ్‌కు కుంగుబాటునకు కారణమైన 7వ బ్లాక్ ఆఫ్స్ట్రీమ్లోని 400క్యూబిక్ మీటర్ల బొయ్యారాన్ని ఇప్పటికే సిమెంట్, ఇసుక మిశ్రమంతో గ్రౌటింగ్ చేసి పూడ్చివేశారు. బరాజ్ ఫౌండేషన్ కిందనున్న సీకెంట్ పైల్స్‌ను రక్షణగా మళ్లీ కొత్తగా ఏర్పాటు చేశారు. వరదల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలన్నీ చేపట్టారు. గతేడాది 12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా ఎక్కడా ఎలాంటి సమస్యా తలెత్తలేదు. బరాజ్ పూర్తిస్థాయి ఎఫ్ఆర్ఎల్ 100 మీటర్లు. 16.7 టీఎంసీలు నిల్వ ఉంటాయి. కానీ నదిలో ప్రవాహ మట్టం 93.5 మీటర్లకు చేరుకుంటే బరాజ్‌లో నీటిని నిల్వ చేయకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని పంపింగ్ చేసుకోవచ్చు. నదిలో ప్రవాహం 50వేల క్యూసెక్కులు దాటితే జలాలు స్వతహాగా కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకునేలా నిర్మించారు. ప్రస్తుతం అక్కడ నీటిని పంపింగ్ చేసుకునేందుకు వీలుగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్ అబద్ధం 2: అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో నీటిని నిల్వ చేస్తే కూలిపోతాయి?
వాస్తవం: గతంలో సుందిళ్ల బరాజ్‌లో రెండు చోట్ల, అన్నారం బరాజ్‌లో నాలుగు చోట్ల నీటి లీకేజీలు ఏర్పడ్డాయి. వాటి నివారణ చర్యల బాధ్యతను అధికారులు డైనోసర్ అనే కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీ సుందిళ్లలో రెండు చోట్ల ఏర్పడిన లీకేజీలను విజయవంతంగా అరికట్టింది. గ్రౌటింగ్ పూర్తి చేసింది. అన్నారంలోకూడా పూర్తి చేసింది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు గ్రౌటింగ్ చేశామని, సీసీ బ్లాకులను పునరుద్ధరించామని, టెస్టులు పూర్తి చేశామని, రిపోర్టులను సమర్పించామని, బరాజ్ నిర్మాణ ఏజెన్సీ అప్కాన్స్ సైతం గతంలోనే కాళేశ్వరం కమిషన్ ఎదుట నివేదించింది. బరాజ్‌లో క్రాక్స్ ఏమైనా వచ్చాయో లేదో చెక్ చేసేందుకు డ్రోన్ సర్వే చేశామని, ఎక్కడా ఒక క్రాక్ కూడా పడలేదని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుందిళ్ల, అన్నారం బరాజ్‌లను వినియోగించుకోవచ్చని నీటిపారుదల శాఖ వర్గాలు సైతం ఘంటాపథంగా చెప్తున్నాయి. అదీగాక అన్నారం బరాజ్ ఎఫ్ఆర్ఎల్ 119మీటర్లుకాగా, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 10టీఎంసీలు. కానీ బరాజ్‌లో 116.5మీటర్ల వరకు నీటిమట్టాన్ని మెయింటెయిన్ చేస్తే చాలు, అక్కడి నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చు.
అంటే కేవలం 3 నుంచి 4 టీఎంసీలు నిల్వ చేస్తే చాలు. సుందిళ్ల బరాజ్ ఎఫ్ఆర్ఎల్ 130 మీటర్లు కాగా, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 8.85 టీఎంసీలు. కానీ బరాజ్‌లో 126మీటర్ల లెవల్ వరకు నీటిని మెయింటెయిన్ చేస్తే నీటిని పంప్‌హౌస్ నుంచి ఎత్తి ఎల్లంపల్లికి తరలించుకోవచ్చు. ఆ లెవల్లో బరాజ్‌లో 3 టీఎంసీలకు మించి జలాలు ఉండవని అధికారులు చెప్తున్నారు. అంటే మొత్తంగా రెండు బరాజ్‌లో 7టీఎంసీల వరకు జలాలు మించవు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు బరాజ్‌లు కూలిపోతాయని అసత్య ప్రచారం చేస్తున్నది. వాస్తవంగా ఈ రెండు బరాజ్‌లలో మేడిగడ్డ తరహాలో మేజర్ సమస్యలేవీ లేవు. కాబట్టి బరాజ్‌లో నీటినిల్వ చేస్తేనే ఇతర సాంకేతిక సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ చిన్నపాటి సమస్యలను గుర్తిస్తే, వెంటనే సవరించుకుని వినియోగించుకునే వీలుంటుందని తెలిపారు. అయినా రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనిచేయలేదు.
అంతేకాదు 2025 మార్చిలో నిర్వహించిన శాసనమండలి సమావేశాల్లో పలువురు సభ్యులు ఇదే అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. ‘మేడిగడ్డ బరాజ్ మాదిరిగా సుందిళ్ల , అన్నారం బరాజ్‌లు కూలిపోతాయని నిపుణులు అభిప్రాయ పడిన విషయం వాస్తవమేనా?’ అని అడిగారు. దానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ ‘ఆ బరాజ్‌లు సేఫ్’ అని ఘంటాపథంగా చెప్పారు.
కాంగ్రెస్ అబద్ధం 3: బరాజ్‌ల దిగువన 40 గ్రామాలు, భద్రాచలం మునిగిపోతుంది?
వాస్తవం: కాంగ్రెస్ చేస్తున్న అతిపెద్ద దుష్ప్రచారం ఇదే. వాస్తవానికి నదీగర్భంలోనే నీటిని నిల్వ ఉండే విధంగా బరాజ్‌లను రూపొందించారు. వాటి పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు బరాజ్‌ల్లో నీటిని నిల్వ చేసినా చుక్కనీరు కూడా నదీ గర్భాన్ని దాటి బయటకు రాదు. అలాంటప్పుడు వరద ఎలా వస్తుందో, ఊర్లను ఎలా ముంచుతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికే తెలియాలి. మరోవైపు అన్నారం, సుందిళ్లలో ప్రస్తుతం గరిష్ఠంగా 7టీఎంసీలను మెయింటెయిన్ చేస్తే ప్రాణహిత జలాలను నిరంతరాయంగా తరలించుకునే అవకాశముంటుంది. ఇక 7 టీఎంసీలు అంటే.. క్యూసెక్కుల్లో చెప్పాలంటే దాదాపు 8లక్షల క్యూసెక్కుల ప్రవాహం. రెండు బరాజ్‌ల నుంచి ఒకే సారి జలాలను ఆ మేరకు విడుదల చేసినా నదిలో ప్రవాహం ఆ మేరకే ఉంటుంది. మేడిగడ్డలో గతేడాది గరిష్ఠంగా 10లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదయింది. మొత్తం కలిపినా 18లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. ఇక భద్రాచలం వద్ద గరిష్ఠంగా 34లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదయిన సందర్భాలున్నాయి. 2022లో భారీ వరద ప్రవాహం సంభవించింది. ఆ సమయంలోనూ భద్రాచలం మునిగిపోలేదు. మాఢవీధుల వరకే వరద ప్రవాహాలు పరిమితమయ్యాయి. వాస్తవాలు ఇలా ఉంటే కాంగ్రెస్ మాత్రం గ్రామాలు మునుగుతాయంటూ ప్రచారం చేస్తూ నీటి ఎత్తిపోతలను నిలిపేసింది. కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప మరేమీ లేదని తెలిసిపోతున్నది.
దేవాదుల నుంచి పంప్ చేశారుగా!
మేడిగడ్డ బరాజ్‌ను వినియోగించలేము కాబట్టి నీటిని లిఫ్ట్ చేయలేమని కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు చెబుతున్నది. కానీ గతంలో ఎలాంటి బరాజ్‌ను నిర్మించకుండానే నీటిని ఎత్తిపోసేలా దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని రూపొందించింది. గోదావరిలో 71మీటర్ల వద్ద ఒక గుంత తవ్వి దానిని ఇన్‌టేక్ పాయింట్‌గా చూపి, 38టీఎంసీలను ఎత్తిపోసి, 6లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రణాళికలను రూపొందించింది. ప్రస్తుతం మేడిగడ్డ బరాజ్‌ను వినియోగించకుండా, ఎగువన కన్నెపల్లి వద్ద నుంచి నీటిని మళ్లించుకునే అవకాశమున్నా కూడా ఆ పనిచేయడాని చేతులు రావడం లేదు. ఇక్కడ ప్రస్తుతం గుంత కూడా తవ్వాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రాణహిత నుంచి 50వేల క్యూసెక్కుల ప్రవాహం దాటితే చాలు స్వతహాగానే కన్నెపల్లి హెడ్‌రెగ్యులేటరీకి పంపులకు నీరు చేరుతుంది. నీటిని లిఫ్ట్ చేయవచ్చు. అయినా ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. దీనిని బట్టి రాజకీయ దురుద్దేశం తప్ప మరేమీ లేదని తెలిసిపోతున్నది.
కాంగ్రెస్ అబద్ధం 4: ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం నడుచుకుంటాం. పునరుద్ధరించాక ప్రాజెక్టును వినియోగిస్తాం.
వాస్తవం: 2024 మార్చి మొదటి వారంలో ఎన్డీఎస్ఏ బృందం రాష్ర్టానికి వచ్చింది. మూడు బరాజ్‌లను పరిశీలించి వెళ్లింది. అప్పటికి సుందిళ్ల బరాజ్‌లో 1.75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. అయినా బరాజ్‌లను ఖాళీ చేయాలని ఆదేశించలేదు. కానీ మార్చి నెలాఖరున ఉన్నపళంగా సుందిళ్ల బరాజ్‌ను ఖాళీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ పూనుకున్నది. అదేమంటే ఎన్డీఎస్ఏ ఆదేశాలంటూ నమ్మబలికింది. దాదాపు 0.75 టీఎంసీలను దిగువకు వదిలిపెట్టింది. దీనిపై అక్కడి రైతులు నాడు తీవ్ర వ్యతిరేక వ్యక్తం చేయడం, స్థానిక ప్రజాప్రతినిధి అధికారులకు ఫోన్ చేయడం, దీంతో మళ్లీ గేట్లు మూసివేయడం వెనువెంటనే జరిగిపోయాయి. దీనిని బట్టి ఎన్డీఎస్ఏను అడ్డుపెట్టుకొని, కాంగ్రెస్ ప్రభుత్వమే బరాజ్‌లను పడావుబెడుతూ వస్తున్నదని తేటతెల్లమవుతున్నది. అంతేకాదు ఎన్డీఎస్ఏ 2024 మే నెలలో కేవలం మధ్యంతర నివేదికను మాత్రమే ఇచ్చింది. ఎలాంటి టెస్టులు పూర్తి చేయకుండా, ప్రాథమిక అంచనాల మేరకు మూడు బరాజ్‌ల్లో నీటిని నిల్వచేయవద్దని మాత్రమే పేర్కొన్నది. 2025 ఏప్రిల్‌లో పూర్తిస్థాయి నివేదికను ఇచ్చింది. అందులో అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో నీటి నిల్వ చేయవద్దనే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. అయినా కాంగ్రెస్ సర్కార్ ఎన్డీఎస్ఏ నివేదికనే సాకుగా చూపుతూ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నది.
రాష్ట్రంలో అన్ని పంటల సాగు 1.35 కోట్ల ఎకరాలు

బరాజ్ లేకున్నా.. దేవాదుల ఎత్తిపోతలు ; నాడు బరాజ్ కట్టకుండానే గోదావరి పక్కన గొయ్యి తవ్వి.. అందులో నీళ్లు నింపి.. దానికి ‘దేవాదుల’ పేరు పెట్టి.. నీటిని ఎత్తిపోసిండ్రు..

బరాజ్, పంప్‌హౌస్ ఉన్నా.. నడువని కన్నెపల్లి ; పంపులు నేడు గోదావరి నీటిని ఒడిసిపట్టేందుకు మేడిగడ్డ బరాజ్ ఉన్నది.. నీటిని ఎత్తిపోసేందుకు కన్నెపల్లి పంప్‌హౌస్ ఉన్నది. అయినా నీటిని ఎత్తిపోయకుండా రైతులపై కాంగ్రెస్ సర్కార్ ఎందుకు కక్షగట్టినట్టు? దేవాదులకు లేని అడ్డంకులు.. కన్నెపల్లికి ఎందుకు?