South India | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): జనాభా నియంత్రణే దక్షిణాది రాష్ర్టాలకు శాపంగా మారింది. జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ర్టాలకు అధిక మేలు దక్కుతున్నది. దీంతో కేంద్ర పన్నుల్లో తీవ్ర వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కానవస్తున్నది. దక్షిణాది రాష్ర్టాలకు న్యాయంగా రావాల్సిన పన్నుల వాటా దకడమే లేదు. ఉత్తరాది రాష్ట్రమైన బీహార్ వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి ఇస్తున్నదనుకొంటే, దానికి ప్రతిగా కేంద్రం రూ.7.26 తిరిగి చెల్లిస్తున్నది. అదే రూపాయి ఇస్తున్న తెలంగాణకు కేవలం 0.47 పైసలనే కేంద్రం విదిలిస్తున్నది. ఒక తెలంగాణకే కాదు.. దక్షిణాది రాష్ర్టాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ ఇలాంటి అన్యాయమే జరుగుతున్నది. కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు వాటా నిర్దేశించే సమయంలో జనాభాను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో జనాభాను నియంత్రిస్తున్న రాష్ర్టాలకు అన్యాయం జరుగుతున్నదని ఆర్థిక నిఫుణులే చెప్తున్నారు.
14వ ఆర్థిక సంఘం (2015-2020) తెలంగాణకు కేంద్ర పన్ను ఆదాయం విభజనలో 2.437% వాటాను కట్టబెట్టింది. 15వ ఆర్థిక సంఘం (2021-2026) 2011 నాటి జనాభా లెకలను పరిగణనలోకి తీసుకోవడంతో తెలంగాణ వాటా 2.102 శాతానికి తగ్గింది. అంటే కేంద్ర పన్నుల్లో వచ్చే వాటాలో 0.335% కోత పడింది. ఫలితంగా తెలంగాణకు ఏటా రూ.4,500 కోట్ల నష్టం కలుగుతున్నట్టు ఆర్థిక నిపుణులు తేల్చి చెప్తున్నారు. నాలుగేండ్లలో తెలంగాణ రాష్ర్టానికి సుమారు రూ.18,000 కోట్ల జరిగింది. వచ్చే ఏడాది మరో రూ.4,500 కోట్ల నష్టం జరగనున్నది.
రాష్ర్టాల నుంచి సీజీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో కేంద్రానికి నిధులు వెళ్తాయి. ఈ నిధుల్లో నుంచి కేంద్రం రాష్ట్రాలకు వాటా పంచుతుంది. ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను పంచుకుంటాయి. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం సిఫారసులు (2021-2026) అమలులో ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం ఉన్నంతవరకు కేంద్ర పన్నుల్లో 42% వాటా రాష్ర్టాలకు పంపిణీ అయ్యేది. 15వ కమిషన్ సిఫారసుల్లో ఈ వాటాను 41 శాతానికి తగ్గించారు.
70వ దశకం మధ్యలో జనాభా నియంత్రణ చర్యలను కేంద్రం తీవ్రతరం చేసింది. జననాలను నియంత్రించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. దాంతో దక్షిణాదిన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేపట్టాయి. కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో అలా జరగలేదు. ఉత్తరాదిన జన విస్ఫోటనం పెరిగింది. పరిశ్రమల స్థాపన, ఉద్యోగావకాశాలు తదితర అభివృద్ధి పనులు దక్షిణాదిన ఊపందుకొని ప్రజల తలసరి ఆదాయం పెరిగితే, ప్రభుత్వాల వైఫల్యం కారణంగా యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో అలా జరుగలేదు.
జనాభాలో 19% వాటా కూడా లేని దక్షిణాది రాష్ట్రాలు.. ప్రస్తుతం జీడీపీలో 32% వాటాను కలిగి ఉన్నాయి. 1976 తర్వాత ఏర్పాటైన ఫైనాన్స్ కమిషన్లు (10వ ఫైనాన్స్ కమిషన్ నుంచి) 1971 జనాభా లెకలను ప్రాతిపదికగా తీసుకొన్నాయి. దాంతో కేంద్ర రాబడి వాటాల్లో దక్షిణాదికి కొంత మేర న్యాయం జరిగింది. 15వ ఆర్థిక సంఘం 2011 నాటి జనాభా లెకలను పరిగణనలోకి తీసుకున్నది. అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలకు 60% మేర ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో జనాభా నియంత్రణ పాటించి, పౌరుల తలసరి ఆదాయాన్ని పెంచిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటాల్లో అన్యాయం జరుగుతున్నది.