హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలను వెతుక్కోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. నష్టాల్లో ఉన్న డిపోలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని ఆదేశించారు. హైదరాబాద్‌లో పెరిగిన ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు పెంచుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లు, టికెట్లపై ప్రకటనల ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని తెలిపారు. గురువారం సచివాలయంలో రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ లా భాలబాట పట్టిందని అభిప్రాయం వ్యక్తంచేశారు. మహిళలకు ఇస్తున్న జీరో టికెట్లకు గాను.. ఆర్టీసీకి ప్రభుత్వం రూ.7,980 కోట్లు చెల్లించిందని వివరించారు. బస్సు ప్రమాదాలను తగ్గించేందుకు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేయలని సూచించారు. ఫోర్త్‌సిటీలో బస్ టెర్మినల్ ఏర్పాటు, రవాణా సౌకర్యాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. మేడారం జాతరకు 3,800 బస్సులు నడపడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు.
ఆదాయం పెంచుకోవాలని ఆర్టీసీకి సూచించిన మంత్రి.. ప్రభుత్వం చేసేదేమీ లేదని పరోక్షంగా తేల్చిచెప్పారని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు, కార్మికులకు వర్తించే పథకాల అమలుపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సమీక్షలో తమ సమస్యల ప్రస్తావనే చేయలేదని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న ధ్వజమెత్తారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి ఇవ్వాల్సిన రూ.900 కోట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి, ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు అందాల్సిన బకాయిలపై మంత్రి ఎందుకు మాట్లాడలేదని నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు కమాల్‌రెడ్డి, మర్రి నరేందర్ నిలదీశారు. ఇప్పటికైనా కార్మికులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రద్దీకి సరిపడా కొత్త బస్సులు కొనకుండా, 16 వేల ఖాళీలు భర్తీ చేయకుండా, అరకొరగా నియామకాలు చేపడుతూ చేతులు దులుపుకోవద్దని హితవు పలికారు.