హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటన ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టు’గా ఉన్నదని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలను దోచుకునేందుకు జీఎస్టీని ఆయుధంగా వాడారని, వాళ్లే పన్నులు వేసి, వాళ్లే తగ్గించి, ఇప్పుడు వాళ్లే సంబురాలు చేసుకుంటున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. జీఎస్టీ పేరుతో గత 8 ఏండ్లుగా పేదల రక్తం తాగిన బీజేపీ నేతలు ఇప్పుడు పేదలకు లబ్ధి చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు.
జీఎస్టీ తగ్గింపు అంతా బీహార్ ఎన్నికల డ్రామా అని, ఇంకా జీఎస్టీ ఫలాలు పేదోడికి అందలేదని అన్నారు. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దానిని ‘గబ్బర్‌సింగ్ ట్యాక్స్’గా అభివర్ణించారని, ఇది దేశ ప్రజలను దోచుకునే ఆయుధంగా మారిందని నిప్పులు చెరిగారు. పెట్రోల్, డీజిల్ లాంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రాహుల్‌గాంధీ సూచించినా మోదీ ప్రభుత్వం స్పందించలేదని ధ్వజమెత్తారు. జీఎస్టీ తగ్గిందని చెప్తున్నప్పటికీ నిత్యావసర వస్తువుల ధరలు ఏమైనా తగ్గాయా? అని ప్రశ్నించారు.