అక్కన్నపేట, ఆగస్టు 22: రాష్ట్రంలో యూరియా కొరత వాస్తవమేనని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ‘పనుల జాతర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన సొసైటీ వద్ద యూరియా కోసం క్యూకట్టిన రైతులతో మాట్లాడారు. మంత్రి రాగానే వందలాది మంది రైతులు ఆయన చుట్టూ గుమిగూడారు. యూరియా కొరతపై నిలదీశారు. ‘కాంగ్రెస్ వచ్చింది… యూరియా కొరత మోపైయింది’ అంటూ అసహనం వ్యక్తంచేశారు. అనంతరం సొసైటీ వద్ద రైతులతో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత వాస్తమేనని చెప్పారు.
ఈ సీజన్లో యూరియా కొరతపై సీఎం రేవంత్‌రెడ్డి రెండు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి కలిసినా ఫలితం లేదని తెలిపారు. అంతేకాకుండా యూరియా కొరతపై పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ సహా రాష్ట్ర ఎంపీలు ఫ్లెక్సీలతో ధర్నా నిర్వహించారని చెప్పారు. అయి నా రాష్ర్టానికి రావాల్సిన యూరియాపై రోజూ కేంద్రంతో లొల్లి పెడుతున్నామని, కానీ కేంద్రం స్పందించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితోనే రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
కరెంటు, విత్తనాలకు సంబంధించిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, ఎరువుల బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని పేర్కొన్నారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ని కూడా యూరియా ఇప్పించాలని కోరినట్టు చెప్పారు. యూరియాపై రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇది మంచిది కాదని పేర్కొన్నారు.
కొరత ఉందనే కారణంతో రైతులు అవసరానికి మించి యూరి యా తీసుకోవద్దని సూచించారు. ఈ సందర్భంగా గతంలో కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా.. అప్పుడు లేని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని పంతుల్తండాకు చెందిన జాటోతు గణేశ్ అనే యువకుడు మంత్రి పొన్నంను నిలదీశారు. ‘అయితే నువ్వు వచ్చి మాట్లాడి ఇప్పిస్తువు రా’ అంటూ మంత్రి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ… ‘ఎవరో చూడయ వాడు, మీ ఊరోడా’ అంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి బెదిరింపు ధోరణిపై రైతులు మండిపడ్డారు.