హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కులగణన సర్వేలో పాల్గొననివారి కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు మరో అవకాశం కల్పిస్తున్నామని.. బీసీ సంఘాలు, మేధావులు సహకరించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బీసీ కుల సంఘాలు, మేధావులతో సచివాలయంలో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఎంపీడీవో కార్యాలయాల్లో కౌంటర్ ఏర్పాటు చేయడంతోపాటు ఆన్లైన్లో కూడా సమాచారం సేకరిస్తామని వివరించారు.
ప్రభుత్వం రీసర్వేకు అంగీకరించడంపై కులసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, జాజుల శ్రీనివాస్‌గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్‌గౌడ్, ఈరవత్రి అనిల్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, వినయ్‌కుమార్, తాడురి శ్రీనివాస్, ప్రొఫెసర్లు మురళి మనోహర్, విశ్వేశ్వర్, తిరుమలి, దాసు సురేశ్, కుమారస్వామి, సంఘాల నేతలు పాల్గొన్నారు.