హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి.. అప్పుడే కేంద్రప్రభుత్వం దిగొస్తుంది’ అని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్ గాంధీభవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యంకాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ నిజస్వరూపం బయట పడిందని విమర్శించారు.
బీసీల పట్ల వక్రబుద్ధిని, కుట్రను బీజేపీ బయటపెట్టుకున్నదని ధ్వజమెత్తారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమేనని, గతంలో తమిళనాడులో సాధ్యమైందని గుర్తుచేశారు. బీసీ బిల్లును ఆమోదించకుండా కేంద్రం మభ్య పెడుతున్నదని విమర్శించారు. బీసీ వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.