కరీంనగర్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చిన యూరియా కొరతపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వరం మార్చారు. యూరియా కోసం రైతులు లైన్లో నిల్చోవాల్సి రావడం బాధాకరమంటూ వాస్తవాలను ఒప్పుకొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం నల్లరామయ్యపల్లి, ఎక్లాస్పూర్ గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాలను ప్రారంభించడంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఎరువులకు సంబంధించి రోజూ కలెక్టర్‌తో మాట్లాడుతున్నం. వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసేది కాదు. కేంద్రం తయారు చేస్తుంది. ఏదేమైనా రాష్ర్టానికి ఎరువుల పరంగా కొంత ఇబ్బంది కలిగింది. నేను కూడా బాధపడుతున్నా. కేంద్రం సరిగా సరఫరా చేయకపోవడం వల్ల సమస్య వచ్చింది. మిగతావాటితో చూస్తే ఇక్కడ(తన నియోజకవర్గం) కొంత మెరుగైనా ఇక్కడ కూడా రైతులు ఎరువుల కోసం లైన్లో నిల్చోవడం నాకు మంచిగా అనిపిస్తలేదు. దానికి నేను కూడా బాధ్యతవహిస్తున్నా. ఎందుకంటే వాస్తవాలను కొన్ని మనం ఒప్పుకోవాల్సి ఉంటది’ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.