హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య సయోధ్య కుదిరినట్టు తెలిసింది. ఇటీవల ఓ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన మంత్రి అడ్లూరిని ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఇది చినికిచినికి గాలివానగా మారడంతో స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇద్దరినీ పిలిచి రాజీ చేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సూచించినట్టు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన ఆయన బుధవారం మంత్రులిద్దరినీ తన నివాసానికి పిలిపించుకున్నారు.
ఈ సందర్భంగా తన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్టు మంత్రి పొన్నం ముక్తసరిగా చెప్పినట్టు తెలిసింది. అయితే, మంత్రి లక్ష్మణ్‌తో వచ్చిన కొందరు మాదిగ నేతలు మాత్రం పొన్నం తీరును తప్పుబట్టినట్టు తెలిసింది. మాదిగ జాతి మీద బహిరంగ వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్‌లో కనీస పశ్చాత్తాపం కూడా లేదని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. దీంతో కల్పించుకున్న మహేశ్‌కుమార్‌గౌడ్ మొండిపట్టుదల పనికిరాదని, స్థానిక ఎన్నికల సమయంలో ఇది పార్టీకి తీరని నష్టం చేస్తుందని చెప్పినట్టు తెలిసింది.
అడ్లూరికి క్షమాపణలు చెప్పాలని పొన్నంకు సూచించినట్టు సమాచారం. దీంతో ఆయన అడ్లూరికి వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నట్టు ప్రకటించారు. సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మకన్సింగ్ రాజ్‌ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు శివసేనరెడ్డి, సంపత్‌కుమార్, అనిల్, వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేతల మధ్య రాజీ కుదిరిన అనంతరం పొన్నం ప్రభాకర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తనకు సోదరుడి వంటివారని, కాంగ్రెస్ పార్టీలో తమకు 30 ఏండ్లుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదని అన్నా రు. ఆయనపై తాను ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని, రాజకీయ దురుద్దేశంతో కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటి లక్ష్మణ్ మనసు నొచ్చుకుందని తెలిసి తాను తీవ్రంగా విచారిస్తున్నట్టు పేర్కొన్నారు.