హైదరాబాద్: రాష్ట్రంలో ఎరువుల కొరత వాస్తవమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అంగీకరించారు. రైతులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదని చెప్పారు. ఎరువుల కొరత వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని ఆరోపించారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎరువుల తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదేనని చెప్పారు. కేంద్రం మన రాష్ట్రంపై వివక్ష చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత రావాలనేది వారి ఉద్దేశమన్నారు. ఈ సమస్యకు బాధ్యత వహించాల్సిన వాళ్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్దేశపూర్వకంగా 4 నెలలుగా ఉత్పత్తి జరగట్లేదని ఆరోపించారు. ఆర్ఎఫ్సీలో ఉత్పత్తి చేసి ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి 11 లక్షల టన్నులకుగాను 5.2 లక్షల టన్నుల ఎరువులే వచ్చాయని వెల్లడించారు. ఎరువుల వైఫల్యం బాధ్యత బీజేపీ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై తీర్చుకోవాలన్నారు. రైతుల సహకారంతో బీజేపీకి వ్యతిరేకంగా ఒత్తిడి తెస్తామని చెప్పారు.