Congress | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో మళ్లీ లొల్లి మొదలైంది. పార్టీలోని బీసీ నేతలు నిరసనగళం వినిపిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అధిష్ఠానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ నేతలకు ప్రాధాన్యం లేకపోవడమే పార్టీ ఓటమికి కారణమని, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులోనూ పార్టీ గెలుపు కష్టమేనని తేల్చి చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో బీసీలకు ఆత్మగౌరవం, గుర్తింపు, అవకాశం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడుక్కుంటే కానీ పదవులు ఇవ్వరా? అని నిలదీశారు. బీసీ నేతలను విస్మరించబట్టే పార్టీ దిగజారిపోయిందని, ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. లేదంటే భవిష్యత్తులో పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారు. మరో సీనియర్ నేత వీ హన్మంతరావు కూడా బీసీ రాగం ఎత్తుకున్నారు. పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఒకే సామాజిక వర్గానికి అందలం
పార్టీలో చాలాకాలంగా ఒకే సామాజిక వర్గం అధికారం చెలాయిస్తోంది. ఇప్పటికే రెడ్ల పార్టీగా పేరు పడిన కాంగ్రెస్‌లోకి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి చేరారు. రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, జీవన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, చిన్నారెడ్డి, కోదండరెడ్డి వంటి వారికి ప్రాధాన్యం ఇస్తూ బీసీ నేతలను పాతరేస్తున్నారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతున్నది. అధిష్ఠానం కూడా వారికే మద్దతునిస్తూ పార్టీని ఒకే కులం చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతున్నదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఆ వర్గానికి చెందిన నేతల చేరికను ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు. బలమైన నేపథ్యం కలిగిన బీసీ నేతలను పార్టీలో చేర్చుకునే విషయంలో కనీసం స్పందించడం లేదని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకరిద్దరు బీసీ నేతలు కీలక స్థానాల్లో కనిపించేవారని, ఇప్పుడు వారి స్థానాలు కూడా మాయమయ్యే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
పని మాది.. పదవులు మీకా?
పార్టీలో కొన్ని రోజులుగా ఒకే సామాజికవర్గం పోకడలు పెరిగిపోవడంతో బీసీ నేతలంతా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ‘పని చేసేది మేము.. పదవులు మాత్రం మీకా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు పార్టీలో సముచిత స్థానం కల్పించకుంటే సహాయ నిరాకరణ తప్పదని హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వకుంటే తమ సత్తా ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే పొన్నాల లక్ష్మయ్య నిరసన గళం విప్పినట్టు చర్చ జరుగుతున్నది. త్వరలోనే మరికొందరు సీనియర్ బీసీ నేతలు పొన్నాల బాటలో నడిచే అవకాశం ఉందని గాంధీభవన్‌లో చర్చ జరుగుతున్నది.