హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): దేవాదుల ప్రాజెక్టును బీఆర్ఎస్ హయాంలోనే పూర్తిచేసినట్టు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్ట్‌పై మంత్రులు అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాత్రలేదని కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 2005లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయని గుర్తుచేశారు. వీటన్నింటినీ అధిగమించి బీఆర్ఎస్ హయాంలో 2016 నుంచి 2024 వరకు 39 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తిచేసి, మోటర్లు బిగించినట్టు వివరించారు.
కానీ మూడు మోటర్లు ఆన్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 15 నెలలు పట్టిందా? అని ప్రశ్నించారు. ధర్మసాగర్‌కు 7.6 టీఎంసీల నీళ్లు మాత్రమే వచ్చాయని, 30 టీఎంసీలను ప్రభుత్వం వృథా చేసిందని ధ్వజమెత్తారు. రైతుల పంటపొలాలు ఎండుతుంటే కాపాడలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని మండిపడ్డారు. బురదలో రాయివేసి, బీఆర్ఎస్పై నెపంనెట్టి తప్పించుకోవాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నదని విమర్శించారు. ఆంధ్రా ప్రభుత్వం టెయిల్ఎండ్ నుంచి నీళ్లు తీసుకెళ్తుంటే నీటిపారుదల శాఖ మంత్రి పట్టించుకోవడమే లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన అసెంబ్లీలో కాంగ్రెస్ అబద్ధాలకు వేదికగా మార్చుకున్నదని విమర్శించారు. బడ్జెట్లోని వాస్తవ లెక్కలను బయటకు రాకుండా కప్పిపుచ్చిందని తెలిపారు.