బచ్చన్నపేట, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా గెలిపించుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం జనగామలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పొన్నాలకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. 45 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తను అవమానానికి, అవహేళనకు గురయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు, తర్వాత రాజకీయ పార్టీల పరిస్థితి ఏమిటో ప్రజలు గమనించాలని కోరారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంతో అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ప్రశంసించారు. పాడిపరిశ్రమకు ప్రోత్సాహకాలు అందించడంలో కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ద్వారా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంలో తాను భాగస్వాముడిని కావాలనే ఆశయంతో పార్టీలో చేరానని వెల్లడించారు. మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి , పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లో చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరమని తెలిపారు. జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు.
కాంగ్రెస్ నుంచి భారీ చేరికలు
పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యసహా జనగామకు చెందిన ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. పార్టీ సీనియర్ నాయకుడు, పట్టణ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్, ప్రముఖ డాక్టర్, మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ సీహెచ్ రాజమౌళి, మాజీ సర్పంచ్ వకుళాభరణం నర్సయ్య పంతులు, మైనార్టీ సెల్ రాష్ట్ర వైస్ ప్రెసెడెంట్ మహ్మద్ ఇక్బాల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీద్, కొమురవెల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుడికె గురవయ్యగౌడ్, వెల్దెండ సర్పంచ్ నర్ర రమణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎర్రమల్ల లక్ష్మణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగమల్ల శ్రీనివాస్, బుర్ర శ్రీనివాసరావు, ఓబీసీ సెల్ మండలాధ్యక్షుడు సుల్తాన్ గోవింద్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సరాబు మధు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు సౌడ మహేశ్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి రావుల రాజేశ్గౌడ్తోపాటు బీజేపీ కౌన్సిలర్ ప్రేమలతారెడ్డి తదితర నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. వారికి బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు.