Ponnala Lakshmaiah | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. 45 ఏండ్లుగా నిస్వార్థంగా, అంకితభావంతో పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్నా.. సీనియర్లపట్ల మరీ ముఖ్యంగా బీసీ నేతలను అవమానాలకు గురిచేస్తున్న పార్టీ తీరు తనను తీవ్రంగా కలిచివేసిందని కంటితడి పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాలు, అవహేళనలు భరించలేకే పార్టీ వీడుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడారు. రాజీనామాకు గల కారణాలను వెల్లడించారు.
45 ఏండ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీలో ఉండడాన్ని గర్వంగా చెప్పుకున్నానని, కానీ గత రెండేండ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయని ఆవేదన చెందారు. అనేక అవమానాలు, అవహేళనలను ఎదుర్కొన్నానని భావోద్వేగానికి గురయ్యారు. తనతో అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని కన్నీటి పర్యంతమయ్యారు. పేద కుటుంబం నుంచి వచ్చి, నాసాలో పనిచేసి, మహోన్నతమైన పదవులు నిర్వర్తించానని, గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా, పేదలకు సేవ చేసేందుకు రాజకీయాల్లో వచ్చినానని వివరించారు. తాను నాలుగుసార్లు వరుసగా గెలిచిన బీసీ నేతనని, మంత్రిగా వివిధ శాఖలకు కొత్తరూపును తీసుకొచ్చానని వివరించారు. అయినప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్లో గుర్తింపు లేకుండాపోయిందని, పార్టీలో అంతా వ్యక్తిస్వామ్యం కొనసాగుతున్నదని ధ్వజమెత్తారు. పార్టీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తంచేశారు.
పార్టీలో బీసీ నేతలను ఒక విధంగా, ఇతర నేతలను మరోవిధంగా చూస్తున్నారని, బీసీ నేతలను మనోవేదనకు గురిచేస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పెత్తందార్ల పడగనీడలో బీసీలకు మనుగడ లేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సందర్భాల్లోనూ తెలంగాణ ప్రాంతంలో 50 శాతం మంది బీసీలకు టికెట్లు రాలేదని వెల్లడించారు. తమ అనుభవాలను చెప్పి పార్టీ పటిష్ఠానికి కృషి చేద్దామని భావించినా.. అసలు తమను కలవడానికి, తాము చెప్పేది వినడానికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ ఓపిక లేకుండా పోయిందని వాపోయారు. తమను కలవడానికి కూడా ఎవరికీ తీరికలేకుండా పోయిందని అన్నారు. బీసీ నేతగా, సీనియర్ రాజకీయ నేతగా ఉన్న తనను అవహేళన చేస్తుంటే స్థానిక నాయకత్వం కూడా ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ కథ కంచికి చేరిందని, నడమంత్రపు నాయకత్వం పార్టీని నట్టేట ముంచుతున్నది స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడుతున్నానని వెల్లడించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, భవిష్యత్తు రాజకీయాల గురించి ఇంకా ఆలోచించలేదని పొన్నాల స్పష్టం చేశారు.