హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ప్రచారం చేసినా తన ఇలాకాలో ఎదురుగాలి వీస్తుండటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రలోభాల పర్వానికి దిగారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. ఎన్నికల నిబంధనలకు పాతరేస్తూ, మంత్రి అనే విషయాన్ని మరిచిపోయి ఉద్యోగ సంఘాల నాయకులను ప్రలోభాలకు గురిచేశారని విమర్శిస్తున్నది. ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి పలువురు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి పొంగులేటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన రికార్డు తాజాగా బయటకు వచ్చింది. ఇది సోషల్‌మీడియాలో సంచలనంగా మారింది. ఆడియో విన్నవారంతా మంత్రి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘మంత్రిస్థాయి వ్యక్తి ఇంత దిగజారి వ్యవహరిస్తారా? ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతారా?’ అంటూ మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగ సంఘాల నేతలను ప్రలోభాలకు గురి చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలోని ఆడియో ప్రకారం.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన బాధ్యతను మంత్రి పొంగులేటి ఉద్యోగ సంఘాల నేతలపై పెట్టారు. ‘కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలి. ఉద్యోగులతో తొందరగా ఓట్లు వేయించాలి. అభివృద్ధి బాధ్యత నాది. మీకు ఏ అవసరం వచ్చినా నేనుంటా’ అంటూ ప్రలోభాలకు తెరలేపినట్టు తెలుస్తున్నది. ‘పనులేమైనా ఉంటే మా వద్దకే రావాలి.. కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే పనులు అవుతాయ’నేలా వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ఆరోపిస్తున్నది.
మంత్రితో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు వీరభక్తి చూపించినట్టు స్పష్టమవుతున్నది. రాష్ట్ర టీజీవో అధ్యక్షుడు వేలేరు శ్రీనివాసరావు, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి జైపాల్, టీజీవో జిల్లా సెక్రటరీ వేలాద్రి, విజయ్, శోభన్‌బాబు, రమణ మంత్రితో టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వీళ్లంతా మంత్రి మెప్పు కోసం పోటీ పడ్డారు. కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు సైతం సిగ్గుపడేలా వీరభక్తిని చూపించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదులాపురం మున్సిపాలిటీలో ఏ వార్డు లో ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులన్నారో జాబితా సిద్ధం చేశారు. విజయ్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం నాలుగు వార్డులు కష్టంగా ఉన్నయి.
అయినా మా కమిటీ రోజూ కూర్చొని రివ్యూ చేసుకుంటున్నది’ అని మంత్రికి వివరించారు. పోల్ మేనేజ్మెంట్ కోసం కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసినట్టు తెలిపారు. వేలాద్రి మాట్లాడుతూ ‘మాకు అప్పగించిన పనిని వంద శాతం పూర్తి చేస్తం.. మీ అడుగుజాడల్లో ముందుకెళ్తం’ అంటూ పరమభక్తిని చాటుకున్నారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి జైపాల్ అయితే ‘ఉద్యోగుల ఓట్లన్నీ వేయించే బాధ్యత మాదే’ అంటూ ఆ ఆడియోలో భరోసా ఇచ్చారు. ‘మున్సిపాలిటీని బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చే బాధ్యత, కోరిక మాది.. మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాం’ అంటూ ప్రకటించారు.
ఉద్యోగ సంఘాల నేతలు మంత్రికి సాగిలపడటంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తమ ఓటు హక్కు స్వేచ్ఛను హరించేలా నేతల తీరు ఉన్నదంటూ మండిపడుతున్నారు. ‘మా ఓటు మా ఇష్టం.. కాంగ్రెస్‌కు వేయిస్తామని వారెలా ప్రకటిస్తరు? మా ఓట్లు సంఘాల నేతలు వేస్తరా?’ అని మండిపడుతున్నారు. ఇది తమ హక్కును హరించడమేనని, తమకు నచ్చినట్టుగానే ఓటు వేస్తామంటూ ఉద్యోగులు తేల్చి చెప్తున్నారు.
ఉద్యోగ సంఘాల నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ రికార్డు బయటకు రావడంతో మంత్రి గందరగోళంలో పడిపోయారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో మంత్రి తిరిగి బీఆర్ఎస్పైనే ఎదుగుదాడికి దిగారు. రికార్డు బయటకు వచ్చిందంటే తన ఫోన్ ట్యాప్ అయిందనే అనుమానాలు కలుగుతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ నెపాన్ని ఎప్పటిలాగే బీఆర్ఎస్పై నెట్టే ప్రయత్నం చేశారు.
దీంతో మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్సా?, బీఆర్ఎస్సా? అని ప్రశ్నిస్తున్నారు. తాను మంత్రిననే విషయం మరిచిపోయి బీఆర్ఎస్పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం ఏమిటంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతూ ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసి, ఇప్పుడు బయట పడటంతో దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా మంత్రి తీరు ఉన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.