Bangladesh : కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ చీకట్లో మగ్గుతోంది. దేశం ఎప్పుడూ లేని విధంగా, తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏకంగా 9-10 గంటల విద్యుత్ కోతలు నమోదవుతున్నాయి. తారిక్ రహమాన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఈ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోలేకపోతోంది. చివరకు భారత్ సాయం కావాలని కోరింది. గతంలో ఎప్పుడూ లేని విద్యుత్ సంక్షోభాన్ని ప్రస్తుతం బంగ్లాదేశ్ ఎదుర్కుంటోంది. తగినంత విద్యుత్ సరఫరా చేయలేకపోవడంతో దేశమంతా భారీ విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 10 గంటల వరకు కోతలు అమలవుతున్నాయి.
దేశంలో 18,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, ఉత్పత్తి మాత్రం 13,000 వాట్లకు తక్కువగానే ఉంది. అసలే, అక్కడి ప్రజలు ప్రస్తుతం తీవ్రమైన ఎండ, ఉక్కపోతలతో అల్లాడతున్నారు. అలాంటి పరిస్థితుల్లో విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ క్రమంలో స్థానిక విద్యుత్ పంపిణీ కేంద్రాలైన పవర్ స్టేషన్లపై, అధికారులపై ప్రజలు దాడులు చేస్తున్నారు. దీంతో పవర్ స్టేషన్ల వద్ద రక్షణ కల్పించాల్సిందిగా పోలీసుల్ని ప్రభుత్వం ఆదేశించింది. విద్యుత్ కోతను ఎదుర్కొనేందుకు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా తగ్గించివేసింది. అలాగే, రాజధాని ఢాకాతోపాటు అనేక నగరాల్లో షాపులు, ఇతర వాణిజ్య, వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్ అన్నీ రాత్రి 8.00 గంటలకే మూసేయాలని ఆదేశించింది. రైతులు కూడా తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రైతులు, వ్యాపార సంస్థల యజమానులు, పరిశ్రమలు విద్యుత్ కొరత ప్రభావానికి గురవుతున్నాయి.
ఈ విద్యుత్ సంక్షోభానికి కారణం చమురు కొరత. తగినంత చమురు లేకపోవడం వల్ల విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతోంది. బంగ్లాదేశ్ 90 శాతం చమురును, 30 శాతం గ్యాస్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే, విదేశాల నుంచి తగినంత చమురు లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సాయం చేయాల్సిందిగా ఇండియాను బంగ్లాదేశ్ కోరింది. భారీగా తమకు డీజిల్ కావాలని ఇండియాను బంగ్లాదేశ్ అడిగింది. ఈ అంశంపై ఇండియా ఇంకా స్పందించలేదు. నిజానికి రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ.. బంగ్లాదేశ్‌కు గతంలో ఇండియా డీజిల్ సరఫరా చేసింది.