హనుమకొండ చౌరస్తా : పరిశోధనలు ( Research ) ప్రయోగశాలలకే పరిమితం కాకుండా పర్యావరణ సమస్యలకు ( Environmental Issues ) ఆచరణాత్మక పరిష్కారాలను అందించే దిశగా సాగాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి జి.రవి ( Ravi ) అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, పరిశోధకులు సమన్వయంతో పనిచేయడం అత్యంత కీలకమని సూచించారు.
కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల్లో భాగంగా విశ్వవిద్యాలయ రసాయన శాస్త్ర విభాగం, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, స్టేట్ ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో సెనెట్హాల్లో నిర్వహించి న రెండురోజుల జాతీయ సదస్సు ముగింపులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
వాయు, జల, భూ కాలుష్యాల పర్యవేక్షణతో పాటు పర్యావరణ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మాజీ సభ్య కార్యదర్శి డాక్టర్ బి.సేన్ గుప్తా , తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ సభ్యుడు ప్రొఫెసర్ గాదె దయాకర్, జాయింట్ సెక్రటరీ పి.వెంకటేశ్వర్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ దినేష్, పాఠ్య ప్రణాళిక అధ్యక్షురాలు టి.సవితా జ్యోత్స్న, బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.