హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : భూభారతి చట్టం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం శాసనమండలిలో ‘భూభారతి’ పేరుతో నూతన రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ చట్టంతో రైతుల అపరిష్కృత భూములకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పకొచ్చారు. గ్రామ కంఠాలకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ట్రస్టులు, సొసైటీలు, దేవాలయాలకు చెందిన భూముల పరిరక్షణకు వీలుగా పాస్ పుస్తకాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి అధికారాలు వికేంద్రీకరించామని, ఎమ్మార్వో, ఆర్డీవోతోపాటు కలెక్టర్లకు అధికారాలు ఇచ్చినట్టు వివరించారు. ఈ చట్టానికి సంబంధించిన సాఫ్టవేర్‌ను వచ్చే 6 నుంచి 9 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ధరణిని తప్పుబట్టడం లేదని, దాని అమలు విధానం బాగా లేదని పేర్కొన్నారు. భూభారతిపై ప్రతిపక్ష సభ్యుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అనంతరం ఈ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది.