స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో ఒకప్పటి సీన్లు పునరావృతం అవుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలకు ఢిల్లీ వేదికగా మారింది. బీఆర్ఎస్ బహిష్కృత నాయకులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు మరికొందరు నాయకులు సోమవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. అయితే, కాంగ్రెస్‌లో చేరడానికి వచ్చిన వారికి వ్యతిరేకంగా అప్పుడే గ్రూప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. రాహుల్‌గాంధీతో పొంగులేటి, జూపల్లి సమావేశం కాకముందే పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో ఖమ్మం జిల్లా సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విడివిడిగా స మావేశమయ్యారు. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరికకు రేణుకాచౌదరి ముందు నుంచీ సుముఖంగా లేనట్టు ప్రచారం జరిగింది.
కేంద్ర మాజీ మంత్రి అయిన త నను సంప్రదించకుండానే ఆయనను పార్టీలో చేర్చుకోవటంపై రేణుక అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఆమె మాణిక్‌రావు ఠాక్రే దృష్టికి తీ సుకెళ్లినట్టు సమాచారం. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరటంపై రేణుకా చౌదరిని మీడియా అడగ్గా, పార్టీలో ఎవరైనా చేరవచ్చని వ్యాఖ్యానించారు. ఆమె స్పం దించిన తీరును బట్టి పొంగులేటి చేరిక పట్ల ఆమె సుముఖంగా లేనట్టు అర్థమైంది. కాంగ్రెస్‌లో చేరేందుకు వచ్చినవారికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, వారిలో చాలామంది ఎన్నికల్లో ఓడిపోయినవారు, టికెట్ దక్కనివారే ఉన్నారని ఒకరిద్దరు సీనియర్లు పెదవి విరిచినట్టు తెలిసింది.
ప్రియాంకతో విడిగా భేటీ
కాంగ్రెస్‌లో చేరడానికి ఢిల్లీకి వెళ్లిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ప్రియాంక గాంధీని కలిసారు. రాహుల్ గాంధీ ఒక్కర్నే కలిస్తే సరిపోదు, ప్రియాంక గాంధీని కూడా కలవటం మంచిదని ఒకరిద్దరు రాష్ట్ర నాయకులు వీరిని ఆమె వద్దకు తీసుకెళ్లినట్టు సమాచారం. రాహుల్‌ను కలిస్తే సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పినప్పటికీ, ఆయన వ్యతిరేక గ్రూపు నాయకులు ప్రియాంక గాంధీ వద్దకు తీసుకెళ్లినట్టు తెలిసింది.
రేవంత్ వ్యతిరేక వర్గానిదే హడావుడి
పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరడానికి ముందు రాహుల్‌గాంధీతో భేటీకి ఢిల్లీ వెళ్లిన సందర్భంగా ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన హడావుడిలో రేవంత్ వ్యతిరేక వర్గీయులదే పైచేయిగా కనిపించింది. వీరి చేరికలో రేవంత్‌రెడ్డి ప్రమేయం కంటే తమ కృషి ఎక్కువ ఉన్నదని చాటుకొనేందుకు ఎక్కువ హడావుడి చేసినట్టు కనిపించింది. పార్టీలో చేరబోయే నేతలను రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేకు మధుయాష్కీ పరిచయం చేయగా, వారిని తానే ఢిల్లీకి తీసుకొచ్చినట్టు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బిల్డప్ ఇచ్చారని రేవంత్‌రెడ్డి వర్గీయులు వాపోయారు.
పొంగులేటికి అవమానం?
కాంగ్రెస్‌లో చేరడానికి ఢిల్లీ వెళ్లిన 35 మంది నాయకుల జాబితాను అఖిల భారత కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి పేరు జూపల్లి కృష్ణారావు కాగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేరును సీరియల్ నంబర్ 15లో చేర్చడం పొంగులేటి వర్గీయులను విస్మయానికి గురి చేసింది. జూపల్లి పూర్వాశ్రమంలో కాంగ్రెస్ నాయకుడు కావటంతో ప్రాధాన్యం ఇచ్చి సీరియల్ నంబర్లో ఒకటిలో చేర్చి పొంగులేటి పేరును 15వ సీరియల్ నంబర్లో అంతగా ప్రాధాన్యం లేనట్టు చేర్చడం ఏమిటని ఆయన వర్గీయులు పెదవి విరిచారు. పార్టీలో మున్ముందు ఇదే పరిస్థితి ఎదురవుతుందేమోనన్న ఆనుమానం వ్యక్తం చేశారు.
జూపల్లికి షాక్
ఖమ్మంలో జూలై 2న జరిగే బహిరంగ సభలో రాహుల్‌గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అదే సభలో తాను కూడా పార్టీలో చేరడం గుంపులో గోవిందలా మారడానికి జూపల్లి కృష్ణారావు సముఖంగా లేరని తెలిసింది. అందుకే జూలై 14 లేక 16న మహబూబ్‌నగర్‌లో విడిగా సభ ఏర్పాటు చేసి అందులో చేరనున్నట్టు ఢిల్లీలో ప్రకటించారు. ఖమ్మం సభకు వస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినా, మహబూబ్‌నగర్ సభకు వచ్చేది రానిది చెప్పలేదు. దీంతో రాహుల్ గాంధీ రాకపోతే ఎలా? అని జూపల్లి కృష్ణారావు సంశయంలో పడ్డట్టు సమాచారం.