హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ‘దీపావళి కంటే ముందే బాంబులు పేలుతాయి.. ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి’ అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డే.. తాజాగా స్థానికసంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైందని, ఈ నెలాఖరులోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటూ వివరాలు వెల్లడించారు. నిజానికి, బాంబులు, అరెస్టులు ఆయన శాఖ పరిధిలోకిరాని అంశాలు! అయినా ఆరోజు పొంగులేటి మాటలకు కాంగ్రెస్ నేతలంతా జబ్బలు చరుచుకున్నారు. ఈరోజు అదే మంత్రి.. తన శాఖ పరిధి దాటి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నదని చెప్తే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఒంటికాలిపై లేచారు. ఇతరుల శాఖలో మీరేందుకు వేలు పెడుతున్నారంటూ అసహనం వ్యక్తంచేశారు.
ఈ పరిణామం కాంగ్రెస్వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వివరాల వెల్లడి నేపథ్యంలో ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య సమన్వయలోపం బయటపడిందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. సీనియర్ మంత్రులకు, సీఎంకు మధ్య రోజురోజుకు అంతరం పెరిగిపోతున్నదనే అభిప్రాయం బలపడుతున్నది. సోమవారం మంత్రివర్గ అంతర్గత సమావేశం నిర్వహించి, కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కలరింగ్ ఇచ్చి, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన ‘రైతునేస్తం’ వేదిక మీదనే బటన్ నొక్కి రైతుభరోసాను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గానికి సమాచారం వెళ్లింది. తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు వేస్తామని చెప్పి, అదే వేదిక మీద స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటన చేయాలనుకున్నట్టు తెలిసింది. కానీ, ఖమ్మం పర్యటనలో మంత్రి పొంగులేటి అత్యుత్సాహంతో సీఎంను కాదని తానే ఎన్నికల నిర్వహణ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతున్నదని ప్రకటించారు. అంత కంటే ముందే రైతుల ఖాతాల్లో రైతుభరోసా వేస్తామని కూడా చెప్పారు. మంత్రి సీతక్క కూడా స్థానిక ఎన్నికలపై కీలకమైన హింట్ ఇచ్చారు. ఎన్నికలపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు.
సీఎం నారాజ్
తన నిర్ణయానికి విరుద్ధంగా మంత్రి పొంగులేటి స్థానిక ఎన్నికల వివరాలను ముందే ప్రకటించడంతో సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనానికి గురైనట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. సోమవారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను తన నివాసానికి పిలిపించి, మంత్రుల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. తాను ఒక కార్యక్రమం తీసుకొని, ఏర్పాట్లు చేసుకున్నాక పొంగులేటి తనను కాదని ఎన్నికల వివరాలు ప్రకటించడంపై మండిపడ్డట్టు తెలిసింది. ఇటువంటి మంత్రులతో తాను పాలన ఎలా చేయాలని ఆవేదన వ్యక్తంచేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పొంగులేటి చర్యలతో తీవ్ర అసహనానికిలోనైన సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం జరపతలపెట్టిన మంత్రివర్గ అంతర్గత భేటీని రద్దుచేయాలని భావించినట్టు తెలిసింది. ఇలా అర్ధాంతరంగా రద్దు చేస్తే.. ఎన్నికల ముందు ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టు అవుతుందనే ఆలోచనతో మధ్యేమార్గంగా.. స్థానిక ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న మంత్రితోపాటు అతి కొద్దిమంది మంత్రులతో మాత్రమే సమావేశం నిర్వహించి, ఎన్నికల కార్యచరణపై చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
సీఎం చెప్పాకే మహేశ్ ఫైర్
సీఎంతో మాట్లాడి బయటికి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ మంత్రి పొంగులేటి వ్యవహారశైలిపై మండిపడ్డట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మంత్రులు ఒకరి శాఖలో మరొకరు వేలు పెట్టడాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు ప్రకటన చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఎవరి ఇష్టానుసారం వాళ్లు మాట్లాడితే పార్టీలో అసమ్మతికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. క్యాబినెట్లో చర్చించి నిర్ణయించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడటం ఏమిటని అసహనం వ్యక్తంచేశారు. పార్టీతో సంప్రదించకుండా మంత్రులుగానీ, నాయకులు గానీ ఏకపక్ష ప్రకటనలు చేయరాదని హెచ్చరించారు.
సీతక్క ఎదరుదాడి
మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యల నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క మీడియా భుజాల మీద పెట్టి ఎదురుదాడికి దిగారు. స్థానిక ఎన్నికలపై నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుందనే మాట మాత్రమే తాను చెప్పినట్టు వివరించారు. అంతకుమించి తానేమీ మాట్లాడలేదని స్పష్టంచేశారు. లోకల్‌బాడీ ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్ వస్తుందని ఎకడా చెప్పలేదని, తనకు జ్ఞానం ఉన్నదని, క్యాబినెట్లో నిర్ణయం జరగకుండా తానెలా చెప్తానని వ్యాఖ్యానించారు. ‘అడవి బిడ్డలం కాబట్టి మా విషయంలో మీడియాలో ఏదిపడితే అది రాయడం ఆవేదనకు గురిచేస్తున్నది’అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు తప్పుగా వెళ్తున్నాయని గ్రహించే అదేరోజు వివరణ కూడా ఇచ్చానని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, క్యాబినెట్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.