హనుమకొండ, మే 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెత్తనంపై ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డికి వరంగల్‌లో ఆదివారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఆరు డీసీసీల అధ్యక్షులు, ముఖ్యనేతలకు ఆహ్వానం అందింది. వరంగల్ నగర పరిధిలో ప్రభుత్వ, అధికార పార్టీ పరంగా జరిగే ప్రతి చిన్న కార్యక్రమానికీ హాజరయ్యే ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఈ సన్మాన కార్యక్రమానికి దూరంగా ఉండటం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సన్నిహితంగా ఉండే మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్, యశస్వినీరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారనే అసంతృప్తితో ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్కకు మధ్య విభేదాలు పెరిగాయి. తాజాగా, ఇద్దరు మంత్రులు వేం నరేందర్‌రెడ్డి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార పార్టీలో కొత్త రాజకీయ సమీకరణలు మొదలయ్యాయనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ నిర్ణయాలు అమలు, కాంగ్రెస్ పార్టీలో ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జోక్యానికి అడ్డుకట్ట వేసేలా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఏకమయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వివిధ పనుల విషయంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంత్రులు కొండా సురేఖ, సీతక్క అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. స్థానిక సమీకరణలను పట్టించుకోకుండా ఇన్చార్జి మంత్రి నిర్ణయా లు తీసుకోవడం వల్ల తమకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఉన్న వేం నరేందర్‌రెడ్డి తాజాగా రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ప్రభుత్వ, అధికార పార్టీ వ్యవహారాలపై ఆయననే సంప్రదించాలని ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిర్ణయించుకున్నారు.