న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ర్యాలీ(CJP Protest) తీసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిగిన ఘర్షణల్లో సుమారు 120 మంది పోలీసులు, 65 మంది విద్యార్థులు గాయపడ్డారని ఢిల్లీ పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. సంసద్ చలో నిరసన ర్యాలీతో లింకున్న సుమారు 15 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ రోజున జంతర్ మంతర్ వద్ద సుమారు పదివేల మంది ఉండి ఉంటారని పోలీసులు చెప్పారు. అయితే అక్కడ శాంతి భద్రతల నిర్వహణ కోసం సుమారు మూడు వేల మందిని మోహరించినట్లు తెలిసింది.
ధర్నా చేస్తున్న ప్రదేశానికి సంఘ విద్రోహ శక్తులు వచ్చారని, వారిని గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను వాడుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా క్రిమినల్ రికార్డు ఉన్న సుమారు రెండు వేల మందిని గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ స్ట్రీట్, కన్నాట్ ప్లేస్ పోలీసు స్టేషన్లలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. బీఎన్ఎస్ 223(బీ), 221, 132 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.