తోటల పేరు చెప్పుకొని పచ్చని పొల్లాల్లోకి తోడేళ్లు చొరబడ్డాయి. స్థానిక రైతులను అణగదొక్కుతూ పంటలు పండే పొలాల నడుమ ప్రాణాలను హరించే కాలుష్య పరిశ్రమను పెడుతున్నాయి. బంగారు భూముల మధ్య కాలుష్య కారక ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతివ్వడం స్థానిక ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారింది.
తుంగభద్ర నదీ తీర ప్రాంతంలోని గ్రామాల్లో సారవంతమైన నల్లరేగడి భూములున్నాయి. ఇక్కడ ఏటా రెండు పంటలు పండుతున్నాయి. వ్యవసాయమే ఊపిరిగా బతుకుతున్న ఆ పల్లెల్లో ఇప్పుడు ఇథనాల్ చిచ్చు రేగింది. ప్రశాంతంగా ఉన్న పల్లెల మెడపై కత్తి వేలాడుతున్నది.
మహబూబ్‌నగర్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పత్తి, మిరప, పొగాకు వంటి పంటలు పండే భూముల్లో ఇథనాల్ పరిశ్రమ అగ్గి రాజేస్తున్నది. ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యంతో సమీపంలోని తుంగభద్ర నదికి కూడా ముప్పు పొంచి ఉన్నదని పర్యావరణవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రాణాలు తీసే పరిశ్రమ ఇక్కడ పెట్టొద్దని 12 గ్రామాలు తిరగబడ్డాయి. పరిశ్రమకు అనుమతులు వచ్చాయని తెలిసినప్పటి నుంచీ ఆందోళన చేస్తున్నాయి. గతంలో ఇక్కడ పరిశ్రమను అడ్డుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు అధికారంలో ఉండి ప్లేటు ఫిరాయించి ఫ్యాక్టరీకి మద్దతుగా నిలవడంతో స్థానిక ప్రజల్లో ఆగ్రహావేషాలు రగులుతున్నాయి. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని పోలీసు యంత్రాంగాన్ని ఉసిగొలిపి రెచ్చగొట్టిన ఫలితంగానే రాజోళి మండలం పెద్ద ధన్వాడ రణరంగంగా మారినట్టు స్పష్టమవుతున్నది.
ఆంధ్రా నుంచి వచ్చిన ఓ విలేకరి జోగుళాంబ జిల్లా గద్వాలలోని శాంతినగర్‌లో స్థిరపడ్డాడు. ఉమ్మడి రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాలు చేసేవాడు. తెలంగాణ వచ్చాక చాలా మంది పేద రైతులను బోల్తా కొట్టించి తోటలు పెడతామని.. వ్యవసాయం చేస్తామని చెప్పి చౌకగా భూములు అగ్రిమెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ భూములను ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎన్నారైలకు భారీ మొత్తం రేట్లతో అమ్ముతున్నాడు. ఇలా అగ్రిమెంట్లు చేసుకున్న దాదాపు 500 నుంచి 1000 ఎకరాల భూమి ఆయన చేతుల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ రకంగానే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్త శ్రీనివాస్ జబ్బలకు పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ శివారులో ఉన్న 26.7 ఎకరాల భూమిని సదరు విలేకరి కట్టబెట్టాడు. రైతుల నుంచి ఎకరాకు రూ.50 వేలు, రూ.60 వేల చొప్పున అగ్రిమెంట్లు చేసుకుని రూ.కోట్లకు అమ్ముకున్నాడు. చిన్న ధన్వాడ శివారులో 173, 174 సర్వే నంబర్లలో ఇథనాల్ కంపెనీ యజమాన్యం 26.06 గుంటల భూమిని కొనుగోలు చేసింది. అందులో 6.39 గుంటల భూమిని నాలాగా మార్చింది. ఇలా కొన్న భూముల్లోనే అదే పేద రైతులకు మరణశాసనం రాసే కాలుష్య కారక కంపెనీకి బీజం పడింది. సదరు పారిశ్రామికవేత్త కొనుగోలు చేసిన 27 ఎకరాల విస్తీర్ణంలో ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం కేంద్ర ప్రభుత్వానికి అనుమతులు కోరగా 2023 జూన్‌లోనే ఇచ్చింది. రైతుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ పరిశ్రమ ఏర్పాటుకు బ్రేక్ వేసింది. కాంగ్రెస్ సర్కారు వచ్చీ రాగానే పారిశ్రామికవేత్త ఇక్కడికి వచ్చి పరిశ్రమ ఏర్పాటు చేస్తానని రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆందోళన చెందిన రైతులు నిరాహార దీక్షలు చేపట్టారు. హఠాత్తుగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేతలు రైతులతో ఈ ఫ్యాక్టరీ నిర్మించబోమని ఏకంగా మంత్రి శ్రీధర్‌బాబు దగ్గరికి వెళ్లి హామీ కూడా ఇప్పించారు.
గత కేసీఆర్ సర్కారు సుమారు 50 మంది దళిత రైతులకు ఇక్కడ 150 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూములన్నీ ఫ్యాక్టరీ భూములకు ఆనుకునే ఉన్నాయి. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటైతే తమ భూముల్లో సాగు చేసుకునే అవకాశం లేకుండా పోతుందని దళితులు ఆవేదన వ్యక్తంచేశారు. బలవంతంగా తమను కూడా ఇక్కడి నుంచి వెళ్లగొడతారని ఆందోళన చెందుతున్నారు. 2009లో తుంగభద్ర వరదల కారణంగా నష్టపోయిన చిన్న ధన్వాడకు చెందిన సుమారు 80 మందికి ఇక్కడే ఐదెకరాల్లో పట్టాలు పంపిణీ చేశారు. ఆర్థిక స్థోమత లేక వారు ఇప్పటికీ నిర్మాణాలు చేసుకోలేదు.
ఫ్యాక్టరీ వద్దని ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు నమోదు చేసి పోలీసు యంత్రాంగం వేధిస్తున్నది. 12 మంది విద్యార్థులపైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిని రేపోమాపో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కేసులు పెడితే తమ పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందని రైతు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. నాగర్‌కర్నూల్ సబ్ జైలర్ నాగరాజు, మరో ప్రభుత్వ ఉద్యోగి కరుణాకర్పైనా పోలీసులు కేసులు పెట్టారు. ఓ డీలర్‌పైనా హత్యాయత్నం కేసు నమోదైంది.
ఘటన జరిగిన రోజు మరియమ్మతోపాటు మరో ముగ్గురు రైతులపై ఫ్యాక్టరీ బౌన్సర్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనను కళ్లారా చూసిన మిగతా రైతులు కంపెనీ సిబ్బంది కారుపై దాడికి దిగారు. పోలీసుల సహకారంతో సిబ్బంది తప్పించుకుపోయారు. ఆ తర్వాత జరిగిన లాఠీచార్జిలో కురవ లింగన్న, కృష్ణ, మోహన్‌తోపాటు అనేక మంది రైతులు పోలీసుల చేతిలో దాడులకు గురయ్యారు. ఆ తర్వాత సాయంత్రం గ్రామాల్లో తిరుగుతూ కనపడినోళ్లందరినీ కొడుతూ పోలీస్ వ్యాన్ ఎక్కించారు. దాదాపు 50 మందిని రాత్రికి రాత్రి రాజోళి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ మీడియా కంట పడకుండా దాచి వారి పేర్లు నమోదు చేశారు. అలా పట్టుకుపోయిన వారి పేర్లు కంపెనీ సీఈవో ఇచ్చిన ఫిర్యాదులో కనిపించడం గమనార్హం. పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు అంటూనే పథకం ప్రకారం ఏకంగా 17 సెక్షన్లతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపారు. కంపెనీ సిబ్బందికి చిన్న గాయం కాకున్నా రైతులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం విమర్శలకు దారితీసింది. ఇదే ఘటనలో కంపెనీ బౌన్సర్ల దాడిలో గాయపడిన రైతులను కనీసం పట్టించుకోకుండా వారి ఫిర్యాదుపై అక్కడి సిబ్బందిపై కేసు నమోదు చేయకుండా వదిలేశారు. ఘటన జరిగిన రోజు పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, మాన్‌దొడ్డి, నౌరోజీ క్యాంప్ రైతులే ఉన్నా ఎఫ్ఐఆర్లో రాజోళికి చెందిన నలుగురిని సాక్షులుగా రాయడం అనుమానాలకు తావిస్తున్నది. 12 మంది రైతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు రాజోళి ఎస్సై జగదీశ్వర్ మీడియాకు వీడియో రిలీజ్ చేశారు. ఎక్కడా పోలీసులు దాడికి గురయ్యారని చెప్పలేదు. హఠాత్తుగా నలుగురు పోలీసులకు గాయాలయ్యాయని ఎఫ్ఐఆర్లో పేర్కొనడం అనుమానాలకు తావిస్తున్నది. మొత్తంమీద రైతులను పథకం ప్రకారమే ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగినట్టు అర్థమవుతున్నది.
రాజోళి ఘటన తర్వాత చుట్టుపక్కల పల్లెలన్నీ భయం భయంగానే ఉన్నాయి. మఫ్టీలో పోలీసులు రైతుల కోసం జల్లెడ పడుతున్నారు. గ్రామాల్లోకి ఎవరు వస్తున్నారో ఇంటెలిజెన్స్ సిబ్బంది ఆరా తీస్తున్నారు. అఖిలపక్ష నేతలను అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలపై నిఘా పెట్టారు.
తమ ప్రాణాలు పోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ పెట్టనిచ్చేది లేదని స్థానిక గ్రామాల ప్రజలు శపథం చేస్తున్నారు. పిల్లా, జల్లా, మసలీ ముతకా అందరూ ఏకమై ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నారు. పెద్ద ధన్వాడ ప్రవేశ మార్గంలో ఉన్న అమరుల స్తూపంపై ‘విషం చిమ్మే ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు’ అంటూ రాశారు. నమ్మి కాంగ్రెస్‌కు ఓటేస్తే తమ బతుకులు ఇంత ఆగమవుతాయనుకోలేదని స్థానికులు వాపోతున్నారు.
పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ సమీపంలో జీఆర్ఎఫ్ ఇథనాల్ కంపెనీకి కేంద్రం అన్ని రకాల అనుమతులిస్తే.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చకాచకా రెడ్ కార్పెట్ పరుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో ఈ కంపెనీని దరిదాపుల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటే.. కాంగ్రెస్ సర్కారు దగ్గరుండి మరీ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్త అక్కడి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు స్పష్టమవుతున్నది. స్థానిక నేతలు ముందుగా వ్యతిరేకించి ఆ తర్వాత సైలెంట్ అయిపోగా అంతా సీఎంవో డైరెక్షన్లోనే నడుస్తున్నదని, పెద్దపెద్ద తలకాయలు దీని వెనుక ఉన్నారని స్వయంగా పోలీసులే చెప్తున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలుడి పేరు వినోద్.. పెద్ద ధన్వాడకు చెందిన ఇతడు చదువుకుంటున్నాడు. రాజోళి ఘటన రోజు అక్కడ లేనే లేడు. సాయంత్రం పొలం పనులకు పోతుండగా పోలీసులు వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి డీసీఎం ఎక్కించారు. తాను స్టూడెంట్ను.. తనకు సంబంధం లేదు అని మొత్తుకుంటున్నా వదిలిపెట్టలేదు. రాత్రంతా రాజోళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. పోలీస్ స్టేషన్లోకి వెళ్తుండగా కూడా లాఠీలతో కొట్టారని, బూతులు తిట్టారని బాలుడు వాపోయాడు. చివరకు ఆధార్ కార్డు చూసి మైనర్ అని పోలీసు ఆఫీసర్లే మాట్లాడుకొని చివరకు తనను ఉదయం వదిలిపెట్టారు.
మూడు నెలల తర్వాత ఏపీకి చెందిన పారిశ్రామికవేత్త అక్కడి సీఎం చంద్రబాబుతో ఒత్తిడి చేయించడంతో తెలంగాణ సీఎంవో కార్యాలయం ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రంగంలోకి దిగింది. సదరు పారిశ్రామికవేత్తతో అధికార పార్టీ నేతలకు వాటాలు ఖరారు కావడంతో పోలీస్ బాస్‌లను రంగంలోకి దింపి గద్వాల పోలీసులకు డైరెక్షన్ ఇప్పించింది. వారు పథకం ప్రకారం రైతులను రెచ్చగొట్టి కేసుల ఉచ్చులో ఇరికించినట్టు తెలుస్తున్నది.
రాజోళి ఘటనపై తెరవెనుక జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంపెనీ ప్రతినిధులు రైతులను రెచ్చగొట్టి బౌన్సర్లతో దాడి చేయించారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ రైతులు మూకుమ్మడిగా తిరగబడ్డారు. రైతులపై దాడి చేసిన కంపెనీ బౌన్సర్లను వదిలేసి ఉల్టా రైతులపైనే పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో 12 మంది విద్యార్థుల పేర్లు కూడా ఉన్నాయి. ఘటనా స్థలంలో లేకున్నా ఒక సబ్ జైలర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడినీ కేసుల్లో ఇరికించారు. 12 మందిని అరెస్టు చేసి జైలుకు పంపి మిగతా వారి కోసం జల్లెడ పడుతున్నారు. మఫ్టీలో పోలీసులు 12 గ్రామాల చుట్టూ తిరుగుతున్నారు.
వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లాలంటే కూడా భయమైతాంది. ఎక్కడ పోలీసులు వస్తారో పట్టుకుపోతారోనని ఆందోళన నెలకొన్నది. ఇథనాల్ ఫ్యాక్టరీ వాళ్లు రైతులను మోసం చేసి భూములు కొన్నరు. ఇప్పుడు ఫ్యాక్టరీ పెడితే బంగారం పండే భూములు విషతుల్యంగా మారుతయి. ఇప్పటికైనా రాజకీయ నాయకులు మా సమస్య పరిష్కరించేందుకు కృషిచేయాలి.
ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం రౌడీలను దింపి.. బౌన్సర్లతో రైతులను బెదిరిస్తున్నది. ఇప్పుడు రండి కంపెనీ పనులు ఆపేందుకు అని సిబ్బంది మాట్లాడినందుకు మేం తిరగబడితే పోలీసులు వాళ్లను ఏమీ అనకుండా మాపైనే దాడులు చేసి కేసులు పెడుతున్నరు. కంపెనీ వద్దని శాంతియుతంగానే పోలీసులకు సహకరించినం. అయినా వాళ్లు కంపెనీకే అండగా ఉండి రైతులపై కేసులు పెట్టిండ్రు.
బియ్యం, జొన్నకు కెమికల్స్ కలిపి రసాయన చర్యల ద్వారా శుద్ధి చేసి ఇథనాల్‌ను బయటకు తీస్తారు. ఇథనాల్‌ను పెట్రోలియం ఉత్పత్తుల్లో కలిపితే పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఇంత వరకు బాగానే ఉన్నా కంపెనీ నుంచి వెలువడే కాలుష్యంతో చుట్టు పక్కల భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. ఫ్యాక్టరీ వ్యర్థాలను పైపులైన్ వేసి తుంగభద్రలో కలపనున్నట్టు తెలుస్తున్నది. ఇదే జరిగితే నదీ జలాలు కూడా కాలుష్యమయం కానున్నాయి. ఫలితంగా మత్స్య సంపదకు నష్టం వాటిల్లడమే కాకుండా గ్రామాల్లో మంచినీరూ కలుషితమయ్యే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని చిత్తనరు వద్ద ఏర్పాటు చేసిన ఇలాంటి ఫ్యాక్టరీతో స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆంధ్రా పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం పథకం ప్రకారం ఇదంతా చేస్తున్నది. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వమే ముందుండి పూనుకోవడం దారుణం. అమాయక రైతులను రెచ్చగొట్టి వారిపై దాడులకు దిగి తిరిగి వారిపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేసి జైలుకు పంపడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనం. కాంగ్రెస్ నేతలకు వాటాలు ఉన్నందుకే కంపెనీని ఆగమేఘాల మీద నిర్మించాలని చూస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో అమాయక రైతులను అణగదొక్కుతున్నారు. రాజోళి మరో లగచర్ల కాకముందే ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీని రద్దుచేసి రైతులపై పెట్టిన కేసులన్నీ భేషరతుగా ఉపసంహరించుకోవాలి. జైళ్లల్లో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలి. లేదంటే ఆందోళన చేస్తాం.