నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లకు ఈ నెల 26న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదేరోజు సాయంత్రం 5గంటల నుంచి ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సికింద్రాబాద్, సిటీ సివిల్ కోర్టులతోపాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి కోర్టులకు చెందిన బార్ అసోసియేషన్ల సభ్యుల ఎన్నికకు ఈ పోలింగ్ జరుగనున్నది.
కాగా, నాంపల్లి క్రిమినల్ కోర్టుల చరిత్రలో తొలిసారిగా ప్రధాన కార్యదర్శి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించడంతో అన్ని కోర్టుల్లో మహిళా అభ్యర్థులను బరిలో నిలిపారు. నాంపల్లి క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొనగా, అధ్యక్ష స్థానానికి డీ వెంకటేశ్, బాల్‌రాజ్‌గౌడ్ పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.