హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చిన్నచిన్న సంఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకపోవడంతో పోలింగ్ యంత్రాంగం ఊపిరిపీల్చుకున్నది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,400 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారందరికీ రాత్రి పొద్దుపోయే వరకు ఓటు వేసే అవకాశం కల్పించారు. రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 64.02% ఓటింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం ప్రాథమికంగా అంచనా వేసింది. తుది లెక్కలు వచ్చిన తరువాత ఈ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉన్నది. హైదరాబాద్ నియోజకవర్గంలో అతి తక్కువగా 44.91% పోలింగ్ నమోదు కాగా, సికింద్రాబాద్‌లో 47.49% నమోదైంది.
ఖమ్మంలో అత్యధికంగా 75.19% ఓటింగ్ నమోదైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 62.77% ఓటింగ్ నమోదు కాగా, ఈసారి దానిని అధిగమించడం విశేషం. ఈ సంవత్సరం ఎండలు తీవ్రంగా ఉండటంతో పోలింగ్‌పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం పొడిగించారు. అయితే, వాతావరణం అనూహ్యంగా చల్లబడటంతో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంటుందన్న అంచనాతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున క్యూలైన్లు దర్శనమిచ్చాయి. అయితే, సాయంత్రం వరకు కూడా సాధారణ ఎండలు మాత్రమే ఉండటంతో ఓటింగ్ శాతం పెరిగిందని విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ర్టాలకు లక్షలాది మంది తరలివెళ్లినా పోలింగ్ శాతం పెరగడం అభ్యర్థులను, రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం అధికారులకు ఊరటనిచ్చింది. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవీలత, నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై కేసులతోపాటుగా మొత్తం 38 ఎఫ్ఐఆర్లు సోమవారం ఒక్కరోజే నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 115 ఈవీఎంలు వివిధ కారణాలతో మొరాయించడంతో వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటుచేశారు. పోలింగ్ రోజు సోమవారం ఎన్నికల అక్రమాలపై సీ-విజిల్ యాప్‌కు 225 ఫిర్యాదులు, డయల్ 1950 ద్వారా 21 ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందాయి. రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాలేదని, రీ పోలింగ్ జరపాల్సిన అవసరం ఏర్పడలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా సోమవారం ఉదయం నుంచి బీఆర్కేఆర్ భవన్లో సీఈవో వికాస్‌రాజ్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ నిత్యం పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ద్వారా ఓటింగ్ తీరును పరిశీలిస్తూ, జిల్లా అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు ఓటింగ్ శాతం సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు.