మక్తల్, జూలై 29 : కేంద్ర ప్ర భుత్వం నిధులతో చేపట్టిన పనులను శంకుస్థాపనకు హంగు ఆర్భాటంగా కదిలిన మంత్రి వాకిటి శ్రీహరి అవమానకర పరిస్థితిలో కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వెనుదిరిగిన పరిస్థితి మంగళవారం మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నర్వ మండల కేంద్రంతోపాటు పాతర్చే డ్, నాగిరెడ్డిపల్లి, యాంకి గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు, నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి కేంద్రం రూ.64లక్షల నిధులు విడుదల చేసింది.
వీటికి సంబంధించిన పనులు ప్రారంభించేందుకు ఎంపీ డీకే అరుణకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంత్రి వాకిటి శ్రీహరి హంగు ఆర్భాటంతో బయలుదేరి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఎంపీ పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నందున ఎంపీకి సమాచారం ఇవ్వకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. దీంతో కలెక్టర్ సిక్తాపట్నాయక్ కేంద్రం నిధులతో నిర్మించే పనులకు ఎంపీకి సమాచారం ఇవ్వకుండా పూజా కార్యక్రమాలు చేపట్టడం సరికాదని, వెంటనే వాటిని నిలిపివేయాలని మంత్రికి ఫోన్ చేయడంతో ప్రారంభోత్సవ, శంకుస్థాపన పనులు నిలిపివేసి వెనుదిరిగారు.