‘మేం మిమ్మల్ని నమ్ముకుని కాంగ్రెస్‌లో చేరినం. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా మీకోసం పార్టీ మారినం. ఇప్పుడు ఉప ఎన్నికలంటే మా వల్ల కాదు. ఇప్పుడు రాజీనామా చేస్తే గెలిచే పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలోని వ్యతిరేకతను గ్రహించకుండా ఏడాది పాలనకు రెఫరెండంగా ఎన్నికలకు పోవడమంటే మా గొంతు కోయడమే!’.. ఇదీ కాంగ్రెస్ ముఖ్యనేతతో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లబోసుకున్న గోడు. ఇప్పటికే తమకు అధికార పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నవారు ఉప ఎన్నికలు కూడా జరిగితే తమ ఎమ్మెల్యే పదవి కూడా ఊడుతుందన్న ఆందోళనలో ఉన్నారు. ఈ మేరకు ఉపఎన్నికలకు వెళ్లొద్దంటూ వారంతా ముఖ్యనేతకు మొరపెట్టుకున్నట్టు సమాచారం.
Telangana | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఏడాది పాలనకు రెఫరెండంగా వెళ్లాలంటూ ముఖ్యనేత చేసిన ప్రతిపాదనను సదరు శాసనసభ్యులు ఆదిలోనే తిరస్కరించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పుడు రాజీనామా చేస్తే మళ్లీ గెలిచే పరిస్థితులు క్షేత్రస్థాయిలో లేవని, నమ్మి వచ్చినందుకు గొంతుకోసే ప్రయత్నం చేయవద్దని వారు కరాఖండిగా చెప్పినట్టు సమాచారం. ఇటీవల ఏడాది పాలన ఉత్సవాలపై మంత్రులు, అధికారులతో చర్చించిన అనంతరం, ముగ్గురు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ముఖ్యనేత మాట్లాడినట్టు ఆలస్యంగా తెలిసింది. వీరిలో కేసీఆర్ వద్ద కీలకంగా పనిచేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, తొలిసారి గెలిచిన మరో ఎమ్మెల్యే ఉన్నట్టు తెలిసింది.
ఏ పని పెట్టుకున్నా ముందుకు సాగకుండా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, లా అండ్ ఆర్డర్‌ను అతి సులువుగా తమ చేతుల్లోంచి లాక్కొని ఊహించనంత వేగంగా అల్లర్లు పుట్టించి తననో విఫల నేతగా ప్రజల ముందు ఉంచేందుకు కుట్రలు చేస్తున్నారని ముఖ్యనేత వారితో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వీళ్ల దాడిని తిప్పి కొట్టాలంటే.. పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఏడాది పాలనపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి సత్తా చూపితే ఒక్క దెబ్బతో అందరి నోళ్లు మూయించవచ్చన్నది ముఖ్యనేత ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. ప్రజలు తమ పట్ల విశ్వాసంతో ఉన్నారని, కేటీఆర్, హరీశ్‌రావు తనను ముందుకు పడనివ్వటం లేదని ప్రజలు గ్రహించారని ఆ ముఖ్యనేత భావిస్తున్నట్టు తెలిసింది. ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు కాకున్నా.. అమలు చేస్తున్న హామీలతో ప్రజల్లో సానుకూలత ఉందనే ఇంటెలిజెన్స్ నివేదికలు వస్తున్నాయని, కాబట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే.. ప్రతిపక్షాల చెంప మీద కొట్టినట్టు ఉంటుందని ముఖ్యనేత ప్రతిపాదించినట్టు తెలిసింది.
రాజీనామాకు ససేమిరా
ప్రజల్లో సానుకూలత ఉందని చెప్పటం తప్పుడు సమాచారమని, ఉపఎన్నికలకు వెళ్తే అధికారాన్ని బంగారు పళ్లెంలో పెట్టి కేసీఆర్‌కు అప్పగించినట్టేనని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. ఇండ్లు కూల్చటం, భూములు గుంజుకోవటం మినహా.. ఏం చేశామని ప్రజల్లోకి వెళ్లి చెప్పుకుంటామని నిలదీసినట్టు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే.. ‘తమ్మీ నిన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినం. రాజీనామాలు, ఉప ఎన్నికలు అంటూ గొంతుకోసే ప్రయత్నాలు చేయకు. రాజీనామా చేయం, ఉప ఎన్నికలకు వెళ్లం’ అని ఒకింత గట్టిగానే చెప్పినట్టు తెలిసింది. రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, పోలీసులు ఏ ఒక్క వర్గమైనా మనతో ఉందా? అని ప్రశ్నించినట్టు అంతర్గత వర్గాలు వెల్లడించాయి. రైతు రుణ మాఫీ, ఆరు గ్యారెంటీల అమలు మీద జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని స్పష్టంచేసినట్టు సమాచారం. హైదరాబాద్‌లో హైడ్రా, ఎఫ్టీఎల్ అంటూ ఇండ్లు కూలగొట్టిన ప్రభావం ఒక్క బాధితుల మీదనే ఉంది అనుకుంటున్నారా? అంటూ నిలదీసినట్టు తెలిసింది. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ప్రజల పక్షాన అత్యంత సమర్ధంగా పనిచేస్తున్నదని, హైడ్రా, మూసీ బాధితులు, ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్లు, గ్రూప్-1 అభ్యర్థులు, లగచర్ల బాధితులు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తెలంగాణ భవన్‌కే వెళ్తున్నారని చెప్పినట్టు తెలిసింది. ప్రభుత్వం ప్రజాభవన్‌లో పెట్టిన గ్రీవెన్స్ సెల్‌కు వచ్చే ఫిర్యాదుల కంటే తెలంగాణ భవన్‌కు వెళ్తున్న జనాలే ఎక్కువని సీనియర్ ఎమ్మెల్యే తేటతెల్లం చేసిట్టు సమాచారం.
10 సీట్లలో 70శాతం కేసీఆర్‌వైపే
గద్వాల, భద్రాచలం, స్టేషన్‌ఘన్‌పూర్, జగిత్యాల, బాన్సువాడ, చేవెళ్ల, పటాన్చెరు, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో రహస్యంగా ప్రజాభిప్రాయం సేకరించాలని ముఖ్యనేత కాంగ్రెస్‌పార్టీ వ్యూహకర్తను కోరినట్టు తెలిసింది. ఈ మేరకు సదరు వ్యూహకర్త అక్టోబర్ మాసం నుంచి నవంబర్ చివరి వారం వరకు ఆయా నియోజకవర్గాల్లో రెండు పర్యాయాలు రహస్య సర్వే నిర్వహించినట్టు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో 70 శాతం మంది ప్రజలు కేసీఆర్ పట్ల సుముఖత వ్యక్తం చేశారని ఆ వ్యూహకర్త ముఖ్యనేతకు నివేదించినట్టు తెలిసింది. తొందరపడి ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే 75 శాతం నుంచి 100 శాతం సీట్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులే గెలిచే ప్రమాదం ఉందని నివేదించినట్టు తెలసింది.