హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రుణాల మాఫీ, రైతుభరోసా పథకాల అమలులో ఆర్థిక భారాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలా అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీంతో అందుకు అనుసరించాల్సిన మార్గాలను అధికారులు సూచించినట్టు సమాచారం. ఈ రెండు పథకాలకు అయ్యే మొత్తం ఖర్చులో రూ.20 వేల కోట్లకుపైగా భారాన్ని తగ్గిస్తామంటూ ఆర్థిక, వ్యవసాయ శాఖలకు చెందిన కొందరు అధికారులు ప్రభుత్వానికి భరోసా ఇచ్చినట్టు సచివాలయంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిలో భాగంగానే రుణమాఫీలో భారీగా కోతలు పెట్టినట్టు తెలుస్తున్నది.
వాస్తవంగా రుణమాఫీకి రూ.39 వేల కోట్లు, రైతుభరోసాకు రూ.23 వేల కోట్లు కలిపి ఈ రెండు పథకాల అమలుకు మొత్తం రూ.62 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు తొలుత అంచనా వేశారు. ప్రస్తుతం రుణమాఫీకి రూ.31 వేల కోట్లే అవసరమవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా తెలిపారు. కానీ, రేషన్‌కార్డు, పీఎం కిసాన్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తే రుణమాఫీకి రూ.20-25 వేల కోట్లు సరిపోతాయని, తద్వారా రూ.6-11 వేల కోట్ల వరకు భారం తగ్గుతుందని అధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు సమాచారం.
ఇదేవిధంగా రైతుభరోసా పథకానికి పీఎం కిసాన్ నిబంధనలను అమలు చేయడంతోపాటు భూమిపై సీలింగ్ పెడితే రూ.10-15 వేల కోట్లు సరిపోతాయని, తద్వారా రూ.8-13 వేల కోట్ల భారాన్ని తగ్గించుకోవచ్చని చెప్పినట్టు తెలుస్తున్నది. ఈ లెక్కన ఈ రెండు పథకాలను గరిష్ఠంగా రూ.40 వేల కోట్లతో అమలు చేసి ప్రభుత్వం రూ.20 కోట్లకుపైగా భారాన్ని తగ్గించుకునే అవకాశమున్నదన్న చర్చ జరుగుతున్నది. కానీ, దీనివల్ల రైతులకు అంతే మొత్తంలో నష్టం జరుగుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో రైతులకు నష్టం చేసే ఆలోచనలు చేయోద్దని, ఎలాంటి కొర్రీలు లేకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ, రైతుభరోసా పథకాలను అమలు చేయాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.