హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : దేశంలోని పార్టీలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల పెంపు దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని ఆందోళన వ్యక్తంచేశారు. దశాబ్దాల నుంచి దక్షిణాదిపై కేంద్రం వివక్ష కొనసాగిస్తున్నదని, ప్రస్తుత డీలిమిటేషన్ ప్రతిపాదనలతో పార్లమెంట్లో ప్రాతినిధ్యంతోపాటు అన్ని రంగాల్లో దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు. బెంగళూర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రగతిశీల విధానాల ద్వారా జనాభా పెరుగుదలను నియంత్రించిన దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నదని, జనాభా ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ చేయడానికి తాము వ్యతిరేకమని స్పష్టంచేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా న్యాయంగా ఉంటూనే లోక్‌సభ సీట్లను 543 నుంచి 888కి పెంచాలని సూచించారు. సమావేశంలో కర్ణాటక బీసీ కమిషన్ మాజీ చైర్మన్ సీఎస్ ద్వారకాంత్, కర్ణాటక ఓబీసీ కమిషన్ వైస్ చైర్మన్ భాసర్, సౌత్ ఇండియా బీసీ నాయకుడు రోహిత్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.