హైదరాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ): ప్రతిపాదిత హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ల అభివృద్ధి పనుల్లో వివక్షపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక అసెంబ్లీ సీట్లను అందించిన నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు అధిక ప్రాధాన్యమివ్వడం, విపక్ష పార్టీలు గెలిచిన ప్రాంతాలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో హ్యామ్ విధానంలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి దశ పనుల్లో రూ.6,478.33 కోట్లతో 5,190.25 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. అందులో నల్లగొండ, ఖమ్మం జిల్లాలకే దాదాపు రూ.1500 కోట్ల వరకు కేటాయించారు.
ఉమ్మడి నల్లగొండలో రూ. 623.25కోట్లతో 538 కిలోమీటర్లు, ఉమ్మడి ఖమ్మంలో రూ.850 కోట్లతో 650 కి.మీ.ల మేర రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆర్‌అండ్‌బీకి సంబంధించి 16 సర్కిళ్లలో పనులను 373 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రోడ్ల అభివృద్ధిలో అన్ని జిల్లాలకు సమాన అవకాశాలు లభించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు అధికంగా గెలిచిన గ్రేటర్ హైదరాబాద్‌ను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీని ఆనుకొని ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 2500 కిలోమీటర్ల వరకు ఆర్అండ్బీ రోడ్లున్నాయి. అయినప్పటికీ రూ.367.75 కోట్లతో కేవలం 281.56 కి.మీ.ల రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సిద్దిపేటలో రూ.379.69 కోట్లతో కేవలం 289 కి.మీ.లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
ఏడాదిన్నరలో మరమ్మతులు కూడా చేయని ఆర్అండ్బీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్ల అభివృద్ధి విషయం పక్కకుపెడితే, కనీసం మరమ్మతులు కూడా పూర్తిచేయలేదు. గత ఏడాది వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతులకు సుమారు రూ. 2,500 కోట్లు ఖర్చవుతాయని అధికారులు ప్రాతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. నిధుల సమస్య కారణంగానే రోడ్ల అభివృద్ధికి హ్యామ్ విధానాన్ని చేపడుతున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి.
హ్యామ్ విధానానికి కాంట్రాక్టర్ల విముఖత
మరోవైపు హ్యామ్ విధానంపట్ల కాంట్రాక్టర్లు విముఖత చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుత విధానాన్నే అమలుచేయాలని కోరుతూ ఇదివరకే బిల్డర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసింది. హ్యామ్ విధానంలో 40 శాతం ప్రభుత్వం, మిగిలిన 60 శాతం కాంట్రాక్టర్లు భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన 40 శాతం నిధులు పనులు జరుగుతున్న సమయంలో విడతలవారీగా చెల్లిస్తుంది. కాంట్రాక్టర్లు ఖర్చుచేసే 60 శాతం నిధులు 15 ఏండ్లలో టోల్ ద్వారా వసూలు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం మాత్రం టోల్ వసూళ్లకు అనుమతించకుండా ఆ 60 శాతం నిధులు కూడా తామే 15 ఏండ్లలో కాంట్రాక్టర్లకు చెల్లిస్తామని చెప్తున్నది. కనీసం మరమ్మతులకు కూడా నిధులు ఇవ్వలేని సర్కారు 15 ఏండ్లపాటు తమకు చెల్లింపులు ఎలా చేస్తుందన్నది కాంట్రాక్టర్లలో చర్చనీయాంశంగా మారింది.
హ్యామ్ మొదటి దశ పనుల వివరాలు