ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌కు ‘నీళ్లు, నిధులు, నియామకాలే’ పునాది. అయినప్పటికీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణకు ప్రధాన సమస్య కరెంటు కానున్నదని రాజకీయ విశ్లేషకులు ఆనాడే అంచనా వేశారు. ఎందుకంటే అప్పటివరకు తెలంగాణ రైతాంగానికి ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులో లేవు. దక్షిణ తెలంగాణ రైతులు ప్రత్యేకంగా బోరుబావుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేసేవారు. రోజుకు 6 నుంచి 7 గంటల కరెంటు, అది కూడా లో ఓల్టేజీతో రెండు విడుతలుగా వచ్చేది. ట్రాన్స్ఫార్మర్ల ద్వారా రాత్రివేళల్లో అందించడం రైతులకు శాపంగా మారేది.
అదొక వైభవోజ్వల మహాయుగం, వల్లకాటి అధ్వాన్న శకం. ఓ దిక్కు పంటపొలాలు ఎండిపోతుంటే… విద్యుత్ ప్రమాదాలతో నిత్యం ప్రాణాలు కోల్పోయిన రైతన్నలెందరో… తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణమే తలపించేది. అసంతృప్త జ్వాలలు- సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు, చీటికి మాటికి రైతుల రాస్తారోకోలతో భీతావహ వాతావరణం ఏర్పడేది. గ్రామాల్లో శుభాశుభకార్యాలు జరిగినప్పుడు, సాటి, తోటి మనిషి అంత్యక్రియల అనంతరం కాళ్లుచేతులు కడుక్కోవడానికి కూడా నీళ్లుండకపోయేవి. ప్రజలు 15 నిమిషాల కరెంటు గురించి ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధికి అర్జీలు పెట్టుకునేవారు. అయ్యో పాపమని అరగంట కరెంటు ఎక్కువ ఇస్తే విద్యుత్ ఉద్యోగులకు చార్జి మెమోలు జారీ అయ్యేవి. తద్వారా ఇంక్రిమెంట్లు కోల్పోయిన క్షేత్రస్థాయి ఇంజినీర్లు ఎందరో లెక్కే లేదు. నాడు దసరా, దీపావళి లాంటి పెద్ద పండుగలకు కూడా పగటిపూట సింగిల్ ఫేజ్ కరెంటుకు నోచుకోని గ్రామాలున్నాయి. సానుభూతి ఉన్నా, చేస్తున్న పని అమానవీయమని తెలిసినా బిల్లులు కట్టలేదని స్టార్టర్లు, సర్వీసు వైర్లు (రైతులకు సంబంధించిన) లాక్కుపోయేవారు విద్యుత్తు సిబ్బంది.
త్రీ హెచ్‌పీ మాత్రమే మంజూరు ఉంటే ఫైవ్ హెచ్‌పీల మోటర్ వాడుతున్నారంటూ డెవలప్మెంట్ ఛార్జీలు వసూళ్లకు టార్గెట్లు పెట్టి మరీ ఫైన్లు వసూలు చేయించిన అప్పటి నిర్దయ పాలకులు. ఇవన్నీ ఒకెత్తయితే.. కొత్తగా బోరు వేసుకున్న రైతుకు కనెక్షన్ మంజూరు కావాలంటే ఏండ్ల తరబడి కండ్లు కాయలు కాసేలా చూడాల్సిన పరిస్థితి. ఉమ్మడి రాష్ర్టానికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 50 వేలు మంజూరు చేస్తే మండలానికి పది, ఇరువై కూడా వచ్చేవి కాదు. అప్పు చేసి వేసుకున్న బోరుకు అనధికారికంగా కరెంటు వాడుకుంటూ ఒక్క కరెంటు డిపార్టుమెంట్‌కే కాదు, పాలోడికి, పక్కోడికీ భయపడాల్సిన పరిస్థితి.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నాటి విశ్లేషకుల అంచనాలు తలకిందులయ్యాయి. నిజంగనే విద్యుత్‌రంగంలో ‘కమాల్ కర్ దియా’. పంజాబ్ స్పీకర్ అన్నట్లు కేసీఆర్‌నే కమాల్ కర్ దియా. పగటిపూట ఏడు గంటల కరెంటు చాలనుకున్న తెలంగాణ రైతాంగానికి అంతకుమించి కరెంటు అందుతున్నది. అదీ ఉచితంగా, అదీ నాణ్యంగా. 2018 జనవరి 1 నిజంగా ఒక పండుగ దినం. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించడం ప్రారంభించిన సుదినం. దేశంలో ఎక్కడా లేనివిధంగా సాహసోపేతమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుపరిచిన దినం. 2018, జనవరి 1 నుంచి నేటిదాకా ఐదేండ్ల సంపూర్ణకాలం రైతులకు 24 గంటల, ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను అందించడమంటే మామూలు విషయం కాదు. ఇటీవల బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లు ‘నీ హెచ్‌పీ ఎంత’ అనే కౌన్ కిస్కా ఈ రోజున్నాడా?
ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎనిమిదేండ్లలో విద్యుత్‌రంగం మీద సుమారు రూ.91 వేల కోట్ల నిధులు వెచ్చించి రైతాంగాన్ని ఆదుకున్న తీరు అద్వితీయం. ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్లలో 8 లక్షల 10 వేల నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చింది. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోపే రైతులు కనెక్షన్లు పొందుతున్నారు. కరెంటు కోతల్లేవు. ట్రాన్స్ఫార్మర్ల పేలుళ్లు లేవు. మోటార్లు కాలడం అంతకన్నా లేదు. ఇంతకంటే రైతుకు కావాల్సిందేముంటుంది?
2022 డిసెంబర్ 30 నాడు విద్యుత్ డిమాండ్ 14,017 మెగావాట్లుగా నమోదైంది. సాధారణంగా శీతాకాలంలో కాకుండా వేసవికాలం డిమాండ్‌లో భారీ పెరుగుదల ఉంటుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 లక్షల 54 వేల పంపుసెట్లు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. విద్యుత్ వినియోగం కూడా 230.8 మిలియన్ యూనిట్లుగా రికార్డయింది. వచ్చే వేసవికాలంలో మార్చి, ఏప్రిల్‌లలో విద్యుత్ డిమాండ్ 16 వేల మెగావాట్లకు పైగా నమోదవడం ఖాయమని దీన్నిబట్టి తెలుస్తున్నది.
డిమాండ్, వినియోగం ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువగా నమోదవడం పట్ల నాటి విశ్లేషకులే ఆశ్చర్యపోతున్నారు. నాటి రాజకీయ నాయకులే నోరెళ్ల బెడుతున్నారు. స్వరాష్ట్రంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకరరావు, డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఏ.గోపాల్రావుల నేతృత్వంలో ఏర్పరచుకున్న ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ రాబోయే ఎలాంటి డిమాండ్‌నైనా తట్టుకునే పటిష్ఠతను సంతరించుకున్నది. రానున్న వేసవికాలం సవాల్‌ను సమర్థంగా ఎదుర్కొంటుదన టంలో ఎలాంటి సందేహం లేదు.
2022 డిసెంబర్ 28న 13591 మెగావాట్లు, 2022 డిసెంబర్ 30న 14017 మెగావాట్లు పీక్ డిమాండ్ నమోదైంది.
2014 జూన్ 2 నాటికి 18 లక్షల 44 వేల వ్యవసాయ కనెక్షన్లు అయితే 2022 నవంబర్ నాటికి 26 లక్షల 54 వేల కనెక్షన్లు.
2014 జూన్ 6 నాడు నమోదైన పీక్ డిమాండ్ 5661 మెగావాట్లు.
2022 మార్చి 29నాడు నమోదైన పీక్ డిమాండ్ – 14160 మెగావాట్లు.
2022 డిసెంబర్ 29 శీతాకాలంలో 13,748 మెగావాట్లుగా రికార్డు కావడం గణనీయమైన అభివృద్ధి. వచ్చే వేసవికాలంలో 16 వేల మెగావాట్లకు పైగా నమోదవడం ఖాయం.
(రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ ప్రారంభమై 6వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా….)
(వ్యాసకర్త: అధ్యక్షులు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, టీఎస్ఎస్పీడీసీఎల్)
తుల్జారాంసింగ్ ఠాకూర్
78930 05313