ఇటు ఆంక్షల ముళ్లకంచెలు.. అటు స్వాగత గజమాలలు!
ఒకవైపు తెలంగాణ బిడ్డలపై నిర్బంధం!..
మరోవైపు తెలంగాణ మాటే గిట్టనివారికి స్వాగతం!
హైదరాబాద్‌లో శుక్రవారం కనిపించిన భిన్న దృశ్యాలివి.
కాంగ్రెస్ ఏలుబడిలో దిశ మారుతున్న తెలంగాణ ఇది.
కొలువులపై అడగడమే నేరం! హామీలపై ప్రశ్నించడమే పాపం! టీజీపీఎస్సీ ముట్టడికి నిరుద్యోగులు ప్రయత్నించడం కాంగ్రెస్ సర్కారు ఆగ్రహానికి కారణమైంది. ఉద్యోగార్థుల మార్చ్‌పై ఉక్కుపాదం మోపింది. అడుగడుగునా ఆంక్షలు విధించి, పోలీసులను ప్రయోగించింది. కనబడినవారినల్లా అరెస్టు చేసింది. నిరసన తెలుపుకొనే స్వేచ్ఛ ఇస్తామంటూ నమ్మబలికిన ప్రభుత్వ పెద్దలు చివరకు ముళ్లకంచె విధానాన్నే అవలంబించారు. బారికేడ్లతో నిరసనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
విద్యార్థినేతల పట్ల కర్కశంగా వ్యవహరించిన పోలీసులు.. నిరసన గొంతుకపై లాఠీలు ఝళిపించారు. వందలమందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంతటి నిర్బంధంలోనూ నిరుద్యోగుల మార్చ్ విజయవంతమైంది. కొలువుల భర్తీ డొల్లతనాన్ని కుండబద్దలు కొడుతూ తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టడంలో నిరుద్యోగ యువత సక్సెస్ అయ్యింది.
Telangana | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని నిరుద్యోగులు కదం తొక్కారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. ముందస్తు అరెస్టులకు వెరవలేదు. పోలీసుల ఇనుప కంచెలను, ఆంక్షల అడ్డుగోడలను బద్ధలు కొట్టుకుంటూ వేలాది మంది తరలివచ్చి టీజీపీఎస్సీని ముట్టడించారు. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోని కాంగ్రెస్‌పై కన్నెర్రజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనంటూ నిరుద్యోగులు చేసిన నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లింది. లాఠీచార్జీలు, అరెస్టులు, నిర్బంధాలతో ప్రభుత్వం దమనకాండ సాగించింది. నిరుద్యోగుల గర్జనతో దిగివచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఇంట్లోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. తర్వాత తూచ్ అనేశారు. దీంతో తమ డిమాండ్ల సాధనకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం ఉధృతం చేస్తామని నిరుద్యోగులు తేల్చిచెప్పారు.
గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పద్ధతిలో ఎంపిక చేయాలని, గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని, ప్రిపరేషన్‌కు వీలుగా పరీక్షలు వాయిదా వేయాలని వేలాది మంది నిరుద్యోగులు శుక్రవారం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అయితే వీరిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌కు రాకుండా జిల్లాల్లో ఎక్కడికక్కడ నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు అరెస్టులు చేశారు. హైదరాబాద్‌లోనూ పోలీసులు హల్చల్ చేశారు.
టీజీపీఎస్సీ కార్యాలయం ముందు పలు వరుసల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులు మోహరించారు. సచివాలయం, సీఎం నివాసం, ఇతర ప్రధాన భవనాలు, కూడళ్లలో బందోబస్తు నిర్వహించారు. టీజీపీఎస్సీకి వచ్చే అన్ని మార్గాలను తమ అదుపులోకి తీసుకున్నారు. రోడ్లతోపాటు మెట్రో స్టేషన్లపైనా నిఘాపెట్టారు. 18-40 ఏండ్ల మధ్య వయస్కుల్లో అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రశ్నించారు. అనుమానస్పదంగా కనిపించినవారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రైవేట్ ఉద్యోగులు, మహిళలు, కాలేజీల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. స్టూడెంట్స్ అని చెప్పి, కాలేజీ ఐడీ కార్డులు చూపించినా పోలీసులు కనికరించలేదు. అరెస్టు చేసి, స్టేషన్లకు పంపారు. అసెంబ్లీ నుంచి నాంపల్లి వైపు నడుచుకుంటూ వెళ్తున్న వారందరినీ అడ్డగించి, వివరాలు తెలుసుకొని, అరెస్టు చేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. శుక్రవారంనాంపల్లి వైపు రావడమే పాపమన్నట్టు పోలీసులు వ్యవహరించారు.
పోలీసులు అష్టదిగ్బంధనం చేసినా నిరుద్యోగులు వెనక్కి తగ్గలేదు. ఆంక్షల అడ్డుగోడలను బద్ధలుకొడుతూ, పోలీసుల కండ్లుగప్పి వేలాది మంది టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వచ్చినవారిని వచ్చినట్టే వ్యాన్లలోకి బలవంతంగా కుక్కి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో నిరుద్యోగులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. తోపులాటలో పలువురు నిరుద్యోగులకు గాయాలయ్యాయి.
కాళ్లు పట్టుకొని వేడుకున్నా, కన్నీళ్లు పెట్టుకున్నా కనికరం చూపలేదు. అనేకమందిని గోషామహల్ స్టేడియానికి తరలించగా స్టేడియంలోనూ వారి నిరసన కొనసాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ తమ నిరసనను కొనసాగించారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోనూ నిరుద్యోగుల నిరసనలు మిన్నంటాయి. తమ ఉద్యమాన్ని ప్రభుత్వం అణగదొక్కడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీని నెరవేరుస్తారా? లేదా? అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌నే నిలదీస్తామని చెప్పా రు. న్యాయపర మార్గాలనూ అన్వేషిస్తామన్నారు.
నిరుద్యోగుల ఉద్యమానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సంపూర్ణ మద్దతు పలికింది. నేతలు గెల్లు శ్రీనివాస్, రాజారామ్ యాదవ్‌తోపాటు కార్యకర్తలు టీజీపీఎస్సీని ముట్టడించారు.వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోషామహల్ స్టేడియంలో నిర్బంధించిన నిరుద్యోగులకు బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు సంఘీభావం తెలిపారు. వారిని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదం టూ మండిపడ్డారు. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేరేదాకా మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు.
నిరుద్యోగుల గర్జనతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సా యంత్రం ఈ అంశంపై సుమారు 3 గంటలపాటు సమీక్షించారు. నిరుద్యోగుల డిమాం డ్లు, వాటి పరిష్కారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చివరికి నిరుద్యోగుల డి మాండ్లలో గ్రూప్స్ లేదా డీఎస్సీ వాయిదా అంశాన్ని మాత్రమే పరిశీలిస్తామని చెప్పారు. మిగతావన్నీ పక్కన పెట్టేశారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 ఎంపిక చేసినా, గ్రూప్-2, 3 పోస్టులు పెంచినా న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రకటనపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. కోర్టు పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు తీరేదాకా వెనక్కి తగ్గబోమని స్పష్టంచేశారు.
నిరుద్యోగుల మార్చ్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద నిలువెత్తు బారికేడ్లు, గ్రిల్స్‌తో పోలీసులు సృష్టించిన ఇనుప గోడ
ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే ఇంత నిర్బంధమా? నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేస్తరా? ప్రచారంలో ఓ మాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెండు నాలల వైఖరి యువతకు అర్థమైంది. ఇది ప్రజాకంటక పాలన.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఓవైపు ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతులు, హకులను అణగదొకే కుట్రలకు పాల్పడుతున్నది. శాంతియుతంగా నిరసన తెలిపే హకు కూడా నిరుద్యోగులకు లేదా? ఇది ప్రజాపాలన కాదు..ముమ్మాటికీ అప్రజాస్వామ్యపాలన!
– మాజీ మంత్రి హరీశ్‌రావు
1969 తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థుల మరణానికి, మలిదశ ఉద్యమంలో 1,200 మంది మరణానికి కాంగ్రెస్ పార్టీని ప్రధాన కారణం. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇంకెంత మంది తెలంగాణ నిరుద్యోగుల ప్రాణాలు బలి తీసుకుంటుంది?
– గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తుంగబాలు, బీఆర్ఎస్వీ నేతలు
ఉద్యోగాలు ఇవ్వాలని పోరాడుతున్న నిరుద్యోగులను ఎక్కడికక్కడ నిర్భందించడం, అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వ దమనకాండకు నిదర్శనం. శిశుపాలుడి పాపాల చిట్టాలా రేవంత్‌రెడ్డి సరార్ అన్యాయాల చిట్టా పెరిపోతున్నది. లాఠీచార్జీలు, అరెస్ట్‌లు, అడుగడుగునా నిర్బంధాలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజాపాలనా?
– డాక్టర్ ఆంజనేయగౌడ్, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్
ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన. ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డుకీడ్చింది. పోలీసులు రాత్రి నుంచే అమ్మాయిలని కూడా చూడకుండా అరెస్టు చేయడం దారుణం.
– ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి
నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించేదాకా పోరుబాట వీడం. నిరుద్యోగులను రెచ్చగొట్టి, వారి ఓట్లతో గద్దెనెకిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక వారిని నిండా ముంచారు. ఇప్పటికైనా నిరుద్యోగులతో చర్చలు జరిపి హామీలను అమలు చేయాలి.
– రాజారాం యాదవ్, నిరుద్యోగ సమాఖ్య గౌరవాధ్యక్షుడు
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ వద్ద నిరసన తెలుపడానికి వచ్చే నిరుద్యోగులను అడ్డుకోవడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయానికి చేరుకోవడానికి వెళ్లే నాంపల్లి, అబిడ్స్, మొజంజాహీమార్కెట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ వంటి దారులన్నీ బారికేడ్లతో మూసివేశారు.
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): అరెస్టయిన చోటు నుంచే నిరాహార దీక్ష చేద్దామని నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ పిలుపునిచ్చారు. టీజీపీఎస్సీ ముట్ట్టడి సందర్భంగా అనేక మంది అరెస్టయ్యారని తెలిపారు. ఎక్కడ అరెస్టయ్యామో అక్కడి నుంచే పోరుబాటకు సిద్ధం కావాలని కోరారు. తనను తరలించిన గోషామహల్ పోలీస్‌స్టేషన్‌లోనే నిరాహార దీక్ష చేస్తున్నానని చెప్పారు.
హైదరాబాద్, జూలై 5(నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారం కోసం టీజీపీఎస్సీ ముట్టడికి యత్నించిన నిరుద్యోగులపై పోలీసుల నిర్బంధాన్ని పీడీఎస్‌యూ, పీవైఎల్ ఖండించాయి. నిరుద్యోగులపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్, ప్రధాన కార్యదర్శి ఎస్వీ శ్రీకాంత్, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఇందూరి సాగర్, ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో పేరొన్నారు.