హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు, చేతలకు అస్సలు పొంతన కుదరడం లేదు. ఈ విషయాన్ని సర్కారు పలుమార్లు బాహాటంగా బయటపెట్టుకున్నది. తమ ప్రభుత్వంలో అవకతవకలకు ఆస్కారం లేదంటూనే పైరవీలకు తలుపులు బార్లా తెరిచింది. సీనియారిటీకి అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేసిన అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తామని సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వం పదేపదే చెప్తూనే ఉన్నది.
ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. పోలీసుశాఖలో అయితే స్థాయి, హోదా, సీనియారిటీ వంటి మరే ఇతర అంశాలకు ప్రభుత్వం పూచికపుల్లంత విలువ కూడా ఇవ్వడం లేదని బదిలీలు తేటతెల్లం చేస్తున్నాయి. పదోన్నతుల వల్ల పోస్టింగ్, సర్దుబాట్ల వరకు ఓకే కానీ, అభిమానులుగా నిరూపించుకోగలిగితే మాత్రం బదిలీలకు కొదవ ఉండదని ప్రభుత్వ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు సీనియర్ల బదిలీలు నెలకో పోస్టింగ్ అన్న చందంగా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి జీ సుధీర్‌బాబు అడిషనల్ సీపీ (హైదరాబాద్) ట్రాఫిక్ నుంచి రాచకొండ సీపీగా బదిలీ అయ్యారు. నెలన్నర కూడా గడవక ముందే ఆయన స్థానంలో తరుణ్జోషీని ప్రభుత్వం నియమించింది.
ఎన్ని రోజులుంటారో?
వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్‌ను ప్రభుత్వం అడిషనల్ సీపీ క్రైమ్స్ అండ్ సిట్‌గా బదిలీ చేసింది. తాజాగా ఆయనను అక్కడి నుంచి మల్టీ జోన్-1 ఐజీగా బదిలీ చేసింది. పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జీ సుధీర్‌బాబును మల్టీ జోన్-1 ఐజీ స్థానం నుంచి రిలీవ్ చేసింది. పోలీసుశాఖలో ఏ విభాగంలో, ఏ స్థానంలో ఏ అధికారి ఎన్ని నెలలు, రోజులు ఉంటారో తెలియని అయోమయం నెలకొన్నది. సీనియర్ ఐపీఎస్, జూనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలే ఇంత గందరగోళంగా ఉంటే ఇక డీఎస్పీ/అడిషనల్ ఎస్పీస్థాయి అధికారుల బదిలీలు ఇంకెలా ఉంటాయోనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా లేదని, ఈ సర్కారు మాత్రం తమతో చెడుగుడు ఆడుకుంటున్నదని పోలీసు వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
మల్టీజోన్ ఐజీగా రంగనాథ్
రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ పీసీ (క్రైమ్స్), సిట్ ఇన్‌చార్జీగా బాధ్యతలు నిర్వహిర్తిస్తున్న ఏవీ రంగనాథ్‌ను మల్టీ జోన్-1 ఐజీగా, ట్రాఫిక్ అడిషనల్ సీపీగా విధులు నిర్వహిస్తున్న విశ్వప్రసాద్‌ను ఆర్గనైజేషన్ ఐజీగా, హైదరాబాద్ సిటీ సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న శరత్చంద్ర పవార్‌ను స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
సందీప్ శాండిల్యకు డీజీగా పదోన్నతి
సీనియర్ పోలీసు అధికారి, 1993 ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్యకు డీజీపీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.