హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : 2019-21 సంవత్సరాల్లో మంజూరైన ట్రైకార్ రుణాలకు సంబంధించి రూ.219 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గిరిజన సంఘాల జేఏసీ ఏడాదిగా డిమాండ్ చేస్తున్నది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా రాజీవ్ యువవికాసం పథకం పేరిట సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమకు గతంలో మంజూరైన ట్రైకార్ రుణాలు ఇవ్వాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ‘చలో గిరిజన సంక్షేమ భవన్’ ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రైకార్ సంస్థ ద్వారా దాదాపు 30 వేల మంది గిరిజన యువతకు సబ్సిడీ రుణాలు అందించేందుకు రూ.219 కోట్ల చెకులను సిద్ధం చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టిందని, రాజీవ్ యువవికాసం పథకంలో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించలేదని, దీంతో గిరిజన యువత రుణాలు పొందలేని దుస్థితి నెలకొన్నదని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నేడు వేలాదిమందితో మాసబ్‌ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమ భవన్ ముట్టడికి కార్యాచరణ ప్రకటించింది. అయితే, ఈ ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, జేఏసీ నేతలకు ఫోన్లు చేసి కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లాల నేతలను కూడా హైదరాబాద్‌కు రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకోవాలని, రుణాలు విడుదల చేసేవరకు పోరాటం ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. మంజూరైన రుణాలను ఇవ్వకుండా మోసం చేయడమేగాక, ఇదేమని ప్రశ్నిస్తున్న గిరిజన సంఘాల నేతలపై కాంగ్రెస్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నదని మండిపడుతున్నారు.