హనుమకొండ, జనవరి 5 : రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదని, పోలీసు పాలన కొనసాగుతున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. రైతు భరోసా అమలుపై సీఎం రేవంత్ ప్రకటన నేపథ్యంలో ఆదివారం ఆయన హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా కింద ఎకరాకు 15 వేలు ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు 12 వేలకే పరిమితం చేయడం రైతులను మోసం చేయడమేనన్నారు. వరంగల్ వే దికగా రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పు డు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.
హనుమకొండ, జనవరి 5: వరంగల్ పర్యటనకు వస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవడానికి అనుమతి ఇవ్వాలని సీపీని మీడియా ముఖంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి అభ్యర్థించడమే ఆల స్యం.. వెంటనే పోలీసు బలగాలు వాలిపోయి బీఆర్ఎస్ కార్యాలయాన్ని చుట్టుముట్టాయి. నాయకులు కార్యాలయం నుంచి బయటికి రాకుండా గేట్లను మూసి వేశారు. డిప్యూటీ సీఎం పర్యటన సాగినంత సేపు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, పులి రజినీకాంత్, రామ్మూర్తి, రజిత, జ్యోతితోపాటు పార్టీ శ్రేణులను ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్బంధించారు.