హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో తొలిరోజు జీరో అవర్‌లో నిలదీసిన నేపథ్యంలో ప్రభుత్వం లో కదలిక వచ్చింది. అప్పటికప్పుడు ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులపై లెక్కలు కట్టినట్టు తెలిసింది. అతి తక్కువ ఎమౌంట్ ఉన్న వాటిని క్లియర్ చేసే పనిలో ప్రభుత్వం పడింది. ఈ క్రమంలో పోలీసులకు 2024 జూలై లో రావాల్సిన సరెండర్ లీవ్స్‌కు సంబంధించిన నిధులను గత డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో క్లియర్ చేసింది. దీంతో పోలీసు శాఖలోని సుమారు 80 వేల మందికి ఒక్కొక్కరికి వారి క్యాడర్‌ను అనుసరించి రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు జమ అయ్యాయి. కాగా, రాష్ట్రంలో పోలీసులకు సరెండర్ లీవ్స్, టీఏలు, డీఏలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం ప్రశ్నిస్తూ ప్రతి అంశాన్నీ గుర్తుచేస్తే తప్ప ప్రభుత్వంలో కదలిక రావడం లేదని ఉద్యోగులు అంటున్నారు. అసెంబ్లీలో హరీశ్‌రావు తమ సమస్యలపై ప్ర శ్నించడం, ప్రభుత్వం వెంటనే సరెండర్ లీవ్స్ జమ చేయడంతో హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన పెండిం గ్ బిల్లులను కూడా వెంటనే విడుదల చేయాలని వారు కోరుతున్నారు.
పోస్టుల విభజనకు కమిటీ ; 9 మంది సభ్యులతో నియామకం
హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు పోలీస్ కమిషనరేట్లు ఏర్పడిన నేపథ్యంలో వాటి మధ్య పోలీస్ పోస్టుల విభజనకు డీజీపీ శివధర్‌రెడ్డి కమిటీని ఏర్పాటుచేశారు. అదనపు డీజీ (ఆర్గనైజేషన్) అధ్యర్యంలో 9 మంది అధికారు లున్న కమిటీ హోంగార్డ్ నుంచి శాంక్షన్డ్ పోస్ట్‌ల వరకు విభజించనున్నది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల పోలీసు పరిధి మారిం ది. ఈ క్రమంలో సిబ్బంది మధ్య ఉద్యోగోన్నతుల్లో తేడాలు, ఇతరత్రా పలు విష యాలపై నివేదిక సమర్పించాలని డీజీపీ శశిధర్‌రెడ్డి ఆదేశించారు.