హైదరాబాద్, జూలై 2(నమస్తేతెలంగాణ): మంత్రుల సవాళ్లను స్వీకరించి, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని బయటపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్, హరీశ్‌రావు సహా పెద్ద ఎత్తున తరలివచ్చిన గులాబీ సైన్యంపై పోలీసులు జులుం ప్రదర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం తన అధికార దర్పాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ మంత్రుల సవాళ్లకు స్పందించి చర్చలకు వెళ్లనీయకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావును పోలీసులు కట్టడి చేశారు. రాష్ట్ర మంత్రుల సవాళ్లతో దీటుగా సమాధానం చెప్పేందుకు కేటీఆర్, హరీశ్‌రావు ఇతర ముఖ్య నేతలు గురువారం తెలంగాణ భవన్ వద్దకు చేరుకొన్నారు. అప్పటికే గేటు బయట పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ విషయం తెలుసుకొన్న గులాబీ శ్రేణులు పెద్దసంఖ్యలో అక్కడికి తరలివచ్చాయి. మహిళా నాయకులు, కార్యకర్తలు సైతం కదిలివచ్చారు. జై తెలంగాణ, జయహో కేసీఆర్ అన్న నినాదాలతో హోరెత్తించారు. నిలువరించేందుకు యత్నించినా పోలీసులను ప్రతిఘటించారు. తమను అడ్డుకోవడం కాదని, సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావును తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తన వాహనంలో తెలంగాణ భవన్‌కు చేరుకొన్న హరీశ్‌రావు కొద్దిసేపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఇతర ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు. తర్వాత బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి గన్‌పార్క్‌కు బయల్దేరేందుకు గేటు బయటకు వచ్చారు. అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకొన్నారు. మంత్రులసవాళ్లను స్వీకరించి చర్చించేందుకు వెళ్తున్న తనను ఎందుకు నిలువరిస్తున్నారని ప్రశ్నించారు. ‘ఇదేనా? కాంగ్రెస్సర్కార్ మార్క్ ప్రజాస్వామ్యం’ అని నిలదీశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలతో నిరసన వ్యక్తంచేస్తుండగా, బారికేడ్లు పెట్టి వారిని అడ్డుకొన్నారు.
చర్చలకు తెలంగాణ భవన్‌కే వస్తానన్న మంత్రి జూపల్లి కోసం కోసం మూడు గంటలపాటు వేచిచూసిన కేసీఆర్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. గన్‌పార్క్‌కు రావాలని జూపల్లి మరోసారి సవాల్ విసిరిన విషయం తెలుసుకొని అక్కడికి పాదయాత్రగా బయల్దేరేందుకు కేటీఆర్ తెలంగాణ భవన్ గేటు బయటకొచ్చారు. అప్పటికే మోహరించిన పోలీసులు ఆయనను అడ్డగించారు. వారి తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సవాల్ విసిరింది మంత్రి జూపల్లి.. స్వీకరించి వెళ్తున్నది నేను.. మధ్యలో మీకు (పోలీసులకు) ఏం ఇబ్బంది.. మేమేమైనా శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నామా? మిమ్మల్ని ఎవరు పంపించారు.. మమ్మల్ని ఎందుకు నిలువరిస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సవాళ్లు విసిరిన మంత్రికి ధైర్యముంటే పోలీసులను వెనక్కి పిలిపించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే నీ నియోజకవర్గం కొల్లాపూర్‌కు కూడా వస్తానని కేటీఆర్ ప్రకటించారు. పోలీసులు ఆయన్ను బయటకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో పార్టీ నేతల నినాదాల మధ్య తిరిగి వెనక్కి వెళ్లిపోయారు.
తెలంగాణ భవన్‌కు చేరుకొన్న పార్టీ నాయకులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. దమ్ముంటే మంత్రి జూపల్లిని ఇక్కడికి రప్పించాలని డిమాండ్ చేశారు. చర్చలకు వస్తానని తప్పించుకొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు దిష్టిబొమ్మను ఈ సందర్భంగా కార్యకర్తలు దహనంచేశారు. ‘జూపల్లి కాదు.. బోనులో పిల్లి.. సవాల్ విసరడం.. తోకముడవడం జూపల్లి నైజం’ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనలో నాయకులు పల్లె రవికుమార్‌గౌడ్, కిశోర్‌గౌడ్, మన్నె గోవర్ధన్, వాసుదేవారెడ్డి, అభిలాశ్ రంగినేని, ఎర్రోళ్ల, గోసుల శ్రీనివాస్, కురువ విజయ్‌కుమార్, తుంగ బాలు, పడాల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్ గేటు బయట పోలీసులు హరీశ్‌రావును బలవంతంగా అదుపులోకి తీసుకొనేందుకు యత్నించగా పార్టీ నేతలు నిరసనకు దిగారు. ‘ఇదేమి రాజ్యం-దొంగల రాజ్యం, దోపిడీ పాలన-దొంగల పాలన’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరుగడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఈ క్రమంలో హరీశ్‌రావును అరెస్ట్‌చేసిన పోలీసులు వాహనం ఎక్కించేందుకు యత్నిస్తుండగా ఆయన కిందపడిపోయారు. అయినా పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్ట్‌చేశారు. దీంతో కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని చుట్టుముట్టూరు. పోలీస్ వెహికిల్ తాళపు చేతులు తీసుకోవడంతో కొద్దిసేపు కలకలం రేగింది. కార్యకర్తల నుంచి వాటిని పోలీసులు తీసుకొని శ్రేణుల నిరసనల మధ్య హరీశ్‌రావును అదుపులోకి తీసుకొని కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.