BRS | మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించేందుకు బీఆర్ఎస్ బృందానికి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించింది. ఇద్దరు ఐజీలు, ముగ్గురు ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐ, ఎస్సైలతో అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సొరంగ ప్రమాద ఘటనను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు చేయడానికి రాగా, దోమలపెంట సమీపంలోని అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను నిలిపివేశారు. హరీశ్‌రావుతోపాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ల బృందం 150 వాహనాల భారీ కాన్వాయ్‌తో దోమలపెంటకు చేరుకున్నారు. వారు రాకముందే దోమలపెంట చెక్‌పోస్టు నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ వరకు అడుగడుగునా పోలీసు బలగాలు మోహరించాయి. టన్నెల్‌కు వెళ్లే దారిలో కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు, బీఆర్ఎస్ బృందం మధ్య వాగ్వాదం జరిగింది. టన్నెల్లోకి వెళ్లడానికి చివరికి ఎనిమిది మందికి అనుమతి ఇచ్చారు. పోలీసుల వాహనంలో ఎక్కాలని, తాము తీసుకెళ్తామంటూ పోలీసులు వాహనం సిద్ధంగా ఉంచారు. అయితే, హరీశ్‌రావు తమ వాహనంలోనే వస్తానని తెగేసి చెప్పడంతో రెండు వాహనాల్లో ఎనిమిది మందికి అనుమతి ఇచ్చి, వెనుకాముందు పోలీసుల వాహనాలతో తీసుకెళ్లారు. మూడు చెక్‌పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేశాకే లోపలికి అనుమతించారు. లోపల నాలుగో చెక్‌పోస్టు వద్ద మళ్లీ వాహనాలను ఆపి అందులో ఉన్న మాజీ మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రిజనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడిని కిందికి దింపి వాహనాలను తనిఖీ చేశారు. వెంబడి కెమెరాలు, ఫోన్లు ఉండరాదని ఆంక్షలు విధించారు.
ఇప్పటికైనా సహాయక చర్యల్లో సమన్వయం సాధించాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సలహాలు స్వీకరించాలి. ప్రతిదీ జాగ్రత్తగా, వేగవంతంగా చేయాలి. ప్రతి నిమిషం అత్యంత ముఖ్యమైనది. ఇప్పటికే ఆరు రోజులు వృథా చేశారు. ఆక్సిజన్, ఆహారం, మందులు లేకపోతే పరిస్థితి ఏమిటి? లోపల చిక్కుకున్నవారి స్థానంలో ఉండి ఆలోచించాలి. వారంతా ఇతర రాష్ట్ర కూలీలు. ప్రాణాలకు తెగించి మన రాష్ట్రం కోసం ప్రాజెక్టు కడుతున్నరు. వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకండి.
– హరీశ్‌రావు
కెమెరామెన్ ఉంటే కూడా దింపి బయటకు పంపించేశారు. ఎనిమిది మందిని వద్దని కేవలం ఆరుగురే వెళ్లాలని ఆపేశారు. దీంతో ప్రభుత్వ తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ బృందం అక్కడే బైఠాయించింది. చివరకు అనుమతించారు. టన్నెల్ వద్ద ప్రమాదస్థలిని పరిశీలించిన అనంతరం బీఆర్ఎస్ నేతలు తిరిగి జేపీ కంపెనీ గెస్ట్‌హౌస్ వద్ద మీడియా పాయింట్‌కు చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఎమ్మెల్సీలు నవీన్‌రెడ్డి, కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రజినీ సాయిచంద్ మూడో చెక్‌పోస్టుకు రాగానే వాహనాన్ని ఆపేశారు. తాము ఇద్దరం ఎమ్మెల్సీలమని నవీన్‌రెడ్డి, కోటిరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము ప్రజల తరపున వచ్చామని ఎంతచెప్పినా ఆరగంటపాటు వాదోపవాదాలు జరిగినా అనుమతించలేదు. దీంతో వారు బీఆర్ఎస్ నేతలను చూస్తేనే ప్రభుత్వం భయపడుతున్నదంటూ పోలీసుల తీరును ఖండించారు.
మీడియా సమావేశం అనంతరం హరీశ్‌రావు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసేందుకు గెస్ట్‌హౌస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు బంద్ చేశారు. తాను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశానని, ఏడుసార్లు ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నదని, కొన్ని సూచనలు, సలహాలు చేసేందుకు మంత్రి ఉత్తమ్‌ను కలుస్తానని చెప్పినా పోలీసులు అనుమతించలేదు. దీంతో హరీశ్‌రావు గేటును తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. ఎస్పీ, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. దీంతో చేసేది లేక గేటు ఎదుట కూర్చొని నిరసన వ్యక్తంచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకిపోయి మాట్లాడుతరు.. కానీ, ఇక్కడికి వచ్చి చూసే తీరిక లేదంట.. హెలికాప్టర్ వేసుకుని సీఎం ప్రచారానికి పోతే, మంత్రేమో హెలికాప్టర్ లేదని హైదరాబాద్‌లో ఉండిపోయారు.. వీరికి ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికల ప్రచారం ముఖ్యమా? రేవంత్‌రెడ్డి ఎందుకు సమీక్షించలేదు? ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఒక ప్రాజెక్టు కూలిపోతే పట్టించుకునే బాధ్యత లేదా?
– హరీశ్‌రావు
మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంతకుముందు ఘటన స్థలం వరకు అనుమతిచ్చేవారు. కానీ మూడు రోజులుగా రానివ్వడం లేదు. టన్నెల్ పై భాగంలో జేపీ కంపెనీ గెస్ట్‌హౌస్ వద్ద మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. అక్కడే టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యల వివరాలను వెల్లడిస్తున్నారు. గురువారం అక్కడినుంచి బయట చెట్ల కిందకు పంపి గేట్‌ను మూసేశారు. వారిని ఎండలో కూర్చోబెట్టడంతో అప్పుడే గెస్ట్‌హౌస్‌లోకి వచ్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కలిసి పరిస్థితిని వివరించారు. తాగేందుకు నీళ్లులేవు, కూర్చునేందుకు కుర్చీలు లేవు, ఎందుకు ఎండలో నిల్చోబెట్టారని మంత్రిని ప్రశ్నించడంతో అప్పుడు మరో టెంటు వేసి, నీళ్లు ఏర్పాటుచేశారు. ప్రతిపక్షం వస్తున్నందుకు మమ్మల్ని బయటకు పంపించారా? అంటూ మీడియా ప్రతినిధులు సెటైర్లు వేశారు.