యాదగిరిగుట్ట, జూన్15: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అత్యుత్సాహాన్ని చూపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రభుత్వ వైద్యకళాశాలను మల్లాపురంలోనే నెలకొల్పాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. గ్రామానికి చెందిన మహిళలు, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనురాధ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్ దీక్షకు మద్దతు పలికారు. ఆదివారం ఏసీపీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో సీఐలు భాస్కర్, శంకర్‌గౌడ్, కొండల్రావు, ఎస్సై ఉదయ్‌తోపాటు 70 మంది కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు ముందస్త్తు హెచ్చరికలు లేకుండానే ఒక్కసారిగా దీక్షాస్థలికి వచ్చారు. దీక్షలో ఉన్న కర్రె వెంకటయ్యతో పాటు నాయకులను బలవంతంగా లాక్కెళ్లి డీసీఎంలో ఎక్కించారు. దీక్షపై పోలీసుల దాడిని గ్రామ మహిళలు తీవ్రంగా ఖండించారు.
పోలీసులా.. రౌడీలా అంటూ నిప్పులు చెరిగారు. ఎందుకు దాడి చేసి దీక్షను భగ్నం చేస్తున్నారో చెప్పాలని ఏసీపీ శ్రీనివాస్ నాయుడిని నిలదీశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు ఓట్లు వేస్తే ఇలాచేస్తారా అని మండిపడ్డారు. నాయకులను అరెస్టు చేసి తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. వెంటనే వాళ్లను వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. తన అమ్మమ్మ గ్రామమైన మల్లాపురాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే అయిలయ్య పోలీసులతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మహిళలు మండిపడ్డారు. ఇంత మంది పోలీసులను పంపి దీక్షను భగ్నం చేయాల్సిన అవసరమేమొచ్చిందని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. మల్లాపురంలో వైద్యకళాశాల ఏర్పాటు చేసేవరకు ఊరుకునేదిలేదని స్పష్టంచేశారు. ప్రతి ఆడపడుచు కర్రె వెంకటయ్యకు మద్దతుగా నిలుస్తామని ప్రతినబూనారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 183 కోట్లతో మంజూరైన వైద్య కళాశాలను మల్లాపురంలో ఏర్పాటుచేసేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య స్పష్టం చేశారు. మల్లాపురంలో అరెస్టు చేసిన ఆయనను వలిగొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద పరీక్షల కోసం వలిగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడే మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి చేతుల మీదుగా నిమ్మరసం తాగి దీక్షను తాత్కాలికంగా విరమించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య దాతారుపల్లిలో వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆ ప్రాంతంలోనే వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రాంతం వైద్యకళాళాలకు అనువైనది కాదని
స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో పనిచేసే గంధమల్ల రవి అనుమానాస్పద మృ తిపై ప్రశ్నించిన బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్యపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారు. రవి మృతిపై దృష్టి మళ్లించేందుకే పోలీసులను పెట్టించి కర్రె వెంకటయ్యను అరెస్టు చేసిన్నట్టు ఉంది. ఆయనతోపాటు 30 మంది బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో యాదగిరిగుట్ట రూరల్ సీఐగా పనిచేసిన కొండల్రావు బీఆర్ఎస్ కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టారు. ఇప్పుడు మల్లాపురంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రవి అనుమానాస్పద మృతిపై సోషల్ మీడియాలో వైరల్ చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వెంకటయ్యకు ఎలాంటి హాని జరిగినా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, సీఐ కొండల్రావే పూర్తి బాధ్యత వహించాలి.
– గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి